హైదరాబాద్ యూనివర్సిటీలో మళ్ళీ టెన్షన్

నేడు రోహిత్ వేముల ప్రదమ వర్ధంతి సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దళిత విద్యార్దీ సంఘాల జెఎసి యూనివర్సిటీ ప్రాంగణంలో అతని సంస్మరణ సభను నిర్వహించబోతోంది. అయితే దానికి నిర్వాహకులు తమ నుంచి అనుమతి కోరలేదని కనుక యూనివర్సిటీ ప్రాంగణంలో ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీలులేదని యూనివర్సిటీ అధికార ప్రతినిధి ప్రొఫెస్సర్ విపిన్ శ్రీవాత్సవ్ తెలిపారు. సంస్మరణ సభ నిర్వహించుకోవడానికి అనుమతి కోరుతూ లిఖితపూర్వకంగా అభ్యర్ధన చేసినట్లయితే పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని తెలిపారు.

కానీ సభ నిర్వహకులు అటువంటి ఆలోచన ఏదీ చేస్తున్నట్లు లేదు. సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఈ కార్యక్రమానికి రోహిత్ వేముల తల్లి రాధిక వేముల, నగరంలోని వివిధ దళిత విద్యార్దీ సంఘాల నేతలు, దేశంలో వివిధ ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలను ఎదుర్కొన్న భాదిత కుటుంబాల సభ్యులు కూడా హాజరవబోతున్నారు. కనుక యూనివర్సిటీ ప్రాంగణంలో పోలీసుల మోహరింపు అనివార్యంగా కనబడుతోంది. ఒకవేళ తమను లోపలకి ప్రవేశించనీయకుండా అడ్డుకొనే ప్రయత్నాలు చేసినట్లయితే తాము బలవంతంగానైనా లోపలకి ప్రవేశించి రోహిత్ వేముల సంస్మరణ సభ నిర్వహించి తీరుతామని జెఎసి కో-ఆర్డినేటర్ నిఖిల్ కరియప్ప హెచ్చరించారు. కనుక యూనివర్సిటీలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.