సంక్రాంతి పండుగ విరామం తరువాత రాష్ట్ర శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలు మళ్ళీ నేటి నుంచి మొదలుకాబోతున్నాయి. ఈరోజు ఉదయం 10గంటలకు మొదలయ్యే ఈ సమావేశాలలో ఇంతకుముందు నిర్ణయించిన అజెండా ప్రకారమే నేడు, రేపు శాసనసభలో జి.హెచ్.ఎం.సి. అంశం పైన, మండలిలో మైనార్టీ సంక్షేమంపైన చర్చలు జరుగుతాయి. ఒకవేళ ఉభయసభలలో ఇంకా చర్చించవలసిన అంశాలు ఏవైనా ఉన్నాయనుకొంటే, బుధవారంనాడు బి.ఏ.సి.(బిజినాస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకొంటారు.
సాధారణంగా శీతాకాల సమావేశాలు వారం రోజులకంటే ఎక్కువ రోజులు నిర్వహించరు కానీ ప్రతిపక్షాల కోరిక మేరకు తెలంగాణా ప్రభుత్వం ఈసారి ఏకంగా 16 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తోంది. అవసరమనుకొంటే వాటిని ఇంకా పొడిగించేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తోంది. తెరాస ప్రభుత్వం నియంతృత్వ వైఖరితో వ్యవహరిస్తోందని వాదించే ప్రతిపక్షాలకు ఇది జవాబుగా భావించవచ్చు. విశేషం ఏమిటంటే, ఈసారి ప్రతిపక్షాలే వివిధ కారణాలతో ఉభయ సభలను కొన్ని రోజులు వాయిదా వేయాలని కోరడంతో నేటి వరకు వాయిదా పడ్డాయి. ప్రజా సమస్యలపై ఉభయసభలలో చర్చించడానికి తమ ప్రభుత్వం ఎన్నడూ వెనుకాడదని, ప్రతిపక్షాల నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేయదని నిరూపించి చూపుతోంది.