మోడీ మహాత్ముడా?

ప్రధాని నరేంద్ర మోడీకి పట్ల దేశంలోని ప్రతిపక్షాలకు ఎటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ ఈ రెండున్నరేళ్ళలో ఆయన దేశవిదేశాలలో మంచి పేరుప్రతిష్టలు సంపాదించుకొన్నారని అంగీకరించక తప్పదు. కనుక ఆయనకు కొత్తగా ప్రచారమేమీ అవసరమే లేదనే చెప్పాలి. కానీ భారత ఖాదీ కమీషన్ ఏటా ప్రచురించే కేలండర్ లో మహాత్మాగాంధీ చిత్రానికి బదులు నరేంద్ర మోడీ చరఖా తిప్పుతూ నూలు వడుకుతున్నట్లుగా ఫోటో అచ్చు వేయించుకోవడంతో సర్వత్రా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

మోడీకి నూలు వడకడంపై ప్రత్యేకమైన ఆసక్తి ఏమీ లేదని అందరికీ తెలుసు. నిరాడంబరమైన జీవనం, అతి సామాన్య ప్రజల వస్త్రధారణ మహాత్మాగాంధీ జీవన విధానం అయితే అందుకు పూర్తి విరుద్దంగా లక్షలు ఖరీదు చేసే సూట్లు ధరించి తరచూ ప్రత్యేక విమానాలలో విదేశాలలో తిరిగే అలవాటు మోడీది. కనుక గాంధీని అనుకరిస్తూ చరకా ముందు కూర్చొని ఫోటోలకి పోజు ఇవ్వడం అనుచితమేనని చెప్పక తప్పదు. ఆయనకు అంతగా ప్రచారయావ ఉన్నట్లయితే దేశంలో తీవ్ర దారిద్ర్యంతో నానా బాధలు పడుతున్న చేనేత కార్మికులు, వారి కుటుంబాలకి మేలు చేకూర్చే నిర్ణయాలు, విధానాలు ఏమైనా ప్రకటించి అమలుచేయవచ్చు. కానీ కేలండర్ పై గాంధీ స్థానంలో తన ఫోటో ముద్రింపజేసుకోవడం తాను మహాత్మాగాంధీ అంతటి గొప్పవాడినన్నట్లు చెప్పుకొనే ప్రయత్నంలా కనిపిస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మోడీ చర్యను ఆక్షేపిస్తున్నారు. 

మోడీ చర్యకు నిరసనగా పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు వి.హనుమంత రావు, పొన్నల లక్ష్మయ్య, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహంవద్ద సోమవారం దీక్ష చేపట్టారు. మోడీ దేశప్రజలకు క్షమాపణలు చెప్పి, మహాత్ముని బొమ్మతో మళ్ళీ ఖాదీ కమీషన్ కేలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.