హజ్ యాత్రికులకు కేంద్రప్రభుత్వం ఏటా రూ.690 కోట్లు రాయితీగా ఇస్తోంది. ఆ రాయితీని నిలిపివేసి దానిని ముస్లిం బాలికల చదువు కోసం వినియోగించాలని మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన కేంద్రప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ హజ్ యాత్రికులకు ఏటా ఇస్తున్న రూ.690 కోట్ల రాయితీని రూ.1,000 కోట్లకు పెంచాలని కోరుతూ కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీకి ఒక లేఖ వ్రాయడం విశేషం. రాయితీని పెంచినట్లయితే ఇంకా అనేకమంది పేద ముస్లిం ప్రజలకు హజ్ యాత్ర చేసే అవకాశం కలుగుతుందని తన లేఖలో పేర్కొన్నారు.
మజ్లీస్ అధినేత అసదుద్దీన్ రాయితీని నిలిపివేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన వెంటనే మహమూద్ అలీ అందుకు పూర్తి భిన్నంగా కేంద్రానికి లేఖ వ్రాయడం కాకతాళీయమా లేక మైనార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడానికేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే మజ్లీస్ పార్టీకి తెరాస క్రమంగా దూరం అవుతూ భాజపాకు దగ్గరవుతుండటం కనబడుతూనే ఉంది. ఆ కారణంగా రాష్ట్రంలో ముస్లిం ప్రజలు తెరాసకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది.
కనుక హజ్ యాత్రికులకు ఇస్తున్న రాయితీని ఇంకా పెంచమని కోరుతూ మహమూద్ అలీ కేంద్రానికి లేఖ వ్రాయడం ముస్లింలను ఆకట్టుకొనే ప్రయత్నంగానే కనిపిస్తోంది. ఒకవేళ తెరాస, భాజపాలు చేతులు కలుపదలిస్తే కేంద్రప్రభుత్వం తప్పకుండా మహమూద్ అలీ లేఖనే పరిగణనలోకి తీసుకోవచ్చు. హజ్ యాత్రికులకు ఇస్తున్న రాయితీని పెంచకపోయినా ఓవైసీ కోరినట్లుగా దానిని నిలిపివేయకుండా కొనసాగించవచ్చు.