నవజ్యోత్ సింగ్ గత ఏడాది సెప్టెంబర్ లో భాజపాని వీడిన తరువాత అనేక కుప్పిగంతులు వేసి చివరికి నిన్న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నాడు. పంజాబ్ ప్రజల నుంచి, ఆ రాష్ట్రం నుంచి తనను వేరు చేయాలని భాజపా ప్రయత్నించినందునే ఆ పార్టీని వీడానని సిద్దూ చెప్పుకొన్నప్పటికీ, ముఖ్యమంత్రి పదవి కోసమే పార్టీని వీడాడనేది బహిరంగ రహస్యం.
ఆమాద్మీ పార్టీతో బేరసారాలు విఫలం అవడంతో అవాజ్-ఏ-పంజాబ్ అనే స్వంత కుంపటి పెట్టుకొన్నాడు. కానీ ఆ తరువాత కూడా కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలతో చాలా రోజులు బేరసారాలు చేసి చివరికి కాంగ్రెస్ గూటికి చేరుకొన్నాడు. కానీ ఒకవేళ పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే సిద్దూ కోరుకొంటున్నట్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా, ఉప ముఖ్యమంత్రి పదవి లేదా కీలకమైన మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిద్దూ భార్య నవజ్యోత్ కౌర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అమృత్ సర్ (తూర్పు) నియోజక వర్గం నుంచే పోటీ చేయబోతున్నాడు.
రాజ్యసభ సభ్యుడుగా ఉన్న సిద్దూ తన పదవికి, భాజపాకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్దపడుతున్నాడంటే అతను మంత్రి పదవిమీద వ్యామోహంతోనే పార్టీ మారడని స్పష్టం అవుతోంది. ఒక సగటు రాజకీయనేత కంటే కూడా తానే ఎక్కువ అవకాశవాదినని నవజ్యోత్ సింగ్ సిద్దూ నిరూపించుకొన్నాడు. అటువంటి వ్యక్తి ఒకవేళ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా లేదా అధికారంలోక్ వచ్చిన తరువాత అతనికి మంత్రి పదవి ఇవ్వకపోయినా అతను మళ్ళీ పార్టీ మారినా ఆశ్చర్యం లేదు.