జల్లికట్టు రాజకీయాలు దేనికంటే...

సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాలో కోడి పందాలని, తమిళనాడులో ఎడ్ల పందాల (జల్లికట్టు)ని న్యాయస్థానాలు నిషేధించాయి. కానీ రెండు చోట్ల అవి యధాప్రకారం జరుగుతూన్నాయనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ విషయంలో ఏపిలో ప్రతిపక్ష పర్తీలకుముఖ్యంగా వైకాపాకు ప్రత్యేక ఆసక్తి కనబరచకపోవడం వలన దానిపై రాజకీయాలు జరుగడం లేదు. కానీ తమిళనాడులో ప్రతీ చిన్నాపెద్ద అంశాలపై అధికార ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తుంటాయి కనుక సుప్రీంకోర్టు జల్లికట్టు క్రీడను నిషేధించడంపై కూడా చాలా జోరుగా రాజకీయాలు చేస్తున్నాయి. అక్కడి ప్రధాన ప్రతిపక్ష డిఎంకె పార్టీ నేతలు, కార్యకర్తలు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ చెన్నైలో నేడు ధర్నాలు చేస్తున్నారు. తమ సంస్కృతిలో భాగమైన జల్లికట్టుని జరిపి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. దాని కోసం సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడానికి సైతం తాము వెనుకాడబోమని స్పష్టం చేశారు. అన్నాడిఎంకె ప్రభుత్వం జల్లికట్టు క్రీడను నిర్వహించుకోవడానికి ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి ఒక లేఖ వ్రాసి పడేసి, నింద తమ మీద పడకుండా లౌక్యంగా తప్పుకొంది. 

అయితే వాస్తవానికి అధికార ప్రతిపక్షాలు రెంటికీ జల్లికట్టు క్రీడపై కంటే దానితో ముడిపడున్న ప్రజల సెంటిమెంటుపైనే ఎక్కువ ఆసక్తి ఉంది. అందుకే ఈ అంశంపై రోడ్ల మీదకు వచ్చి పోరాడటం ద్వారా ప్రజలను ఆకట్టుకోగలిగితే ఎంతో కొంత రాజకీయ మైలేజి దొరుకక పోతుందా అనే ఆశతోనే దీనిపై రాజకీయాలు చేస్తుంటారు. సంక్రాంతి పండుగ ముగిసిపోగానే మళ్ళీ వచ్చే ఏడాది వరకు దాని గురించి ఎవరూ మాట్లాడకపోవడం గమనిస్తే దానిపై వారికెంత ఆసక్తి ఉందో అర్ధమవుతుంది.