త్వరలో ప్రజలతో కేసీఆర్ ముఖాముఖి

సంక్రాంతి పండుగ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికార నివాసం ప్రగతి భవన్ లోని జనహిత్ సమావేశ మందిరంలో రాష్ట్రంలో వివిధ వర్గాలు, కులాల ప్రజలతో ముఖాముఖి సమావేశం అవబోతున్నారు. వివిధ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై ప్రతిపక్షాలు చాల రాద్దాంతం చేస్తున్నందున, ఆయనే స్వయంగా నిర్వాసిత రైతులతో సమావేశమయ్యి వారి గోడు విని వారి సమస్యలను పరిష్కారానికి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

అలాగే వివిధ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు, కళాకారులు, విద్యార్దీ సంఘాల నేతలతో, ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యి వారి సమస్యల గురించి తెలుసుకోబోతున్నారని సమాచారం. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఆక్రమణల తొలగింపులో నష్టపోయిన ప్రజలతో కూడా అయన సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వివిధ వర్గాలకు చెందిన ప్రజలను ఈ సమావేశానికి ఆహ్వానించబోతున్నారు. వారందరికీ రానుపోను రవాణా సౌకర్యం, వసతి, ఆహారం అన్నీ ప్రభుత్వమే సమకూర్చుతుంది. 

ఈ సందర్భంగా వారి కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించి, వాటిపై వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించుతారు. త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నందున ప్రజలతో ముఖ్యమంత్రి నేరుగా సమావేశమయ్యి వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం వలన వారి అవసరాలకు తగ్గట్లుగా బడ్జెట్ ను రూపొందించవచ్చు. ఈ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి ప్రజలకు మరింత చేరువకాగలరు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించబోయే ప్రజా దర్బార్ కోసం ఆయన కార్యాలయం, వివిధ ప్రభుత్వం శాఖల అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.