తమిళనాడులో అధికార అన్నాడిఎంకె పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ ఈ నెలాఖరులోగా ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టబోతున్నరంటూ తమిళ మీడియాలో చాలా జోరుగా వార్తలు వస్తున్నాయి. ఆమె జనవరి 19, 27 లేదా ఫిబ్రవరి 24వ తేదీలలో ఏదో ఒకరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టవచ్చని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు ఆమె జనవరి 12నే ముఖ్యమంత్రి పదవి చేపడతారని ముందు వార్తలు వచ్చాయి. కానీ సంక్రాంతి పండుగ తరువాతే చేపట్టడం మంచిదని పండితులు సూచించడంతో ఆమె తన నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్నారని తెలుస్తోంది.
పార్టీలో జరుగుతున్న ఈ ప్రచారం, మీడియాలో వస్తున్న ఈ వార్తలు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు తెలియవనుకోలేము. కానీ ఆయన అసలు వాటి గురించి తెలియనట్లే వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమె తన కుర్చీకి ఎసరు పెట్టబోతోందని తెలిసున్నా ఆమెను ఎదిరించే ప్రయత్నం చేయలేదు. అలాగని దాసోహమైపోయి ఆమెను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని అడగలేదు. స్వీకరిస్తారని చెప్పలేదు. అసలు ఏమీ జరుగ(ద)న్నట్లు తన పని తను చేసుకొనిపోతున్నారు.
ఒకవేళ శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టదలిస్తే ముందుగా ఆయనకే ఆ విషయం చెప్పి రాజీనామాకు సిద్దంగా ఉండమని చెప్పి ఉండాలి. కానీ ఇంతవరకు శశికళ అటువంటి ఆదేశం జారీ చేయలేదు కానీ తన మద్దతుల ద్వారా గట్టిగా ప్రచారం చేసుకొంటున్నారు. అది చూసి పన్నీర్ సెల్వం స్వచ్చందంగా తన పదవికి రాజీనామా చేసి దిగిపోతారని శశికళ ఎదురుచూస్తున్నారేమో? ఈ విధంగా శశికళ, పన్నీర్ సెల్వం ఇద్దరూ చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఆయన శశికళపై తిరుగుబాటు చేసి పార్టీని చీల్చుతారో లేకపోతే ఆమెకు సరెండర్ అయిపోయి మళ్ళీ ఆర్ధికమంత్రి పదవితో సర్దుకుపోతారో ఆ ముహూర్తం వచ్చినప్పుడుగానీ తెలియదు.