మాకు హజ్ రాయితీ వద్దు: ఓవైసీ

భాజపా-మజ్లీస్ పార్టీల మద్య పచ్చ గడ్డి వేస్తే బగ్గున మండిపోతుంది. అటువంటిది మజ్లీస్ ఒక ప్రతిపాదన చేయడం కేంద్రప్రభుత్వం దానిని అమలుచేయడానికి వెంటనే చర్యలు చేప్పట్టడం చాలా గొప్ప విషయమే. 

దేశం నుంచి ఏటా లక్షలాది మంది ముస్లింలు హజ్ యాత్రకు సౌదీఅరేబియా వెళుతుంటారు. వారికి విమాన టికెట్స్, సౌదీలో భోజన, వసతి, వైద్య సౌకర్యాల కోసం భారత ప్రభుత్వం ఒక్కో యాత్రికుడికి రూ.76,223లు రాయితీగా చెల్లిస్తోంది. ఇవి 2008సం.నాటి లెక్కలు. ఆ ఏడాదిలో సుమారు 1,21,694 మంది యాత్రికులు ఈ రాయితీని ఉపయోగించుకొన్నారు. ప్రతీ ఏటా ఇంచుమించు అంతే మంది ఈ రాయితీని పొందుతున్నారు. 

ఆ రాయితీని రద్దు చేసి ఆ మొత్తాన్ని ముస్లిం బాలికల విద్య కోసం వినియోగించవలసిందిగా మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఆయన ఈ అభ్యర్ధన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రప్రభుత్వం స్పందించి ఆరుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయడం విశేషం. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్రప్రభుత్వం తగు నిర్ణయం తీసుకొంటుంది. 

హజ్ యాత్రికులకు భారత ప్రభుత్వం కల్పిస్తున్న ఈ బారీ రాయితీపై దాఖలైన ఒక పిటిషన్ పై 2012లో జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజన పి దేశాయ్ లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య  ధర్మాసనం తీర్పు చెపుతూ, ఈ రాయితీని క్రమంగా తగ్గిస్తూ 2022సం.లోగా పూర్తిగా రద్దు చేయమని ఆదేశించింది. ఆ బారీ మొత్తాన్ని ఇంకా ఎక్కువ ప్రయోజనకరమైన అభివృద్ధి పనులపై ఖర్చు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. ఇది కేంద్రప్రభుత్వానికి చాలా పెద్ద ఆర్ధిక భారమే కనుక అది కూడా అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపాదనపై వెంటనే స్పందించింది.