రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదు అన్నట్లు డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైనా వివాదాలు అయన వెంటపడుతూనే ఉన్నాయి. ఆయన గతంలో వ్యాపార పనుల మీద రష్యా వెళ్ళినప్పుడు అక్కడ వేశ్యలతో గడిపారని, ఆ వివరాలన్నీ రష్యన్ ప్రభుత్వం చేతికి చిక్కడంతో ట్రంప్ ని తన గుప్పెట్లో పెట్టుకొనే ప్రయత్నం చేస్తోందని అమెరికన్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ట్రంప్ గట్టిగా ఖండించారు. అవన్నీ అర్ధం పర్ధం లేని పిచ్చి రాతలు తనను వ్యతిరేకించేవారే పనిగట్టుకొని తనపై బురద జల్లెందుకే ఆవిధంగా ప్రయత్నిస్తున్నారని ట్రంప్ అన్నారు. ఆ వార్తలు నిరాధారమైనవని తమ వద్ద ఎవరికీ సంబంధించిన ఎటువంటి రహస్య లేదా అభ్యంతరకరమైన సమాచారం లేదని రష్యా కూడా స్పష్టం చేసింది.
తన విధానాలు నచ్చి రష్యా అధ్యక్షుడు పుతీన్ తనకు దగ్గరవ్వాలనుకొంటే అది తన తప్పు కాదని ట్రంప్ వాదించారు. ఎన్నికల సమయంలో రష్యాతో సహా కొన్ని దేశాలు డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల కంప్యూటర్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నించాయని, కానీ తమ పార్టీ కంప్యూటర్లను హ్యాక్ చేయలేకపోయారని ట్రంప్ అంగీకరించారు. అంటే అమెరికన్ ఎన్నికలను రష్యా ఎంతో కొంతమేర ప్రభావితం చేసిందని మీడియాలో వచ్చిన వార్తలను ట్రంప్ అంగీకరించినట్లే భావించవచ్చు. అవి నిజమైనప్పుడు తన గురించి వచ్చిన వార్తలు నిజం కావని ప్రజలను నమ్మించడం ట్రంప్ కి కష్టమే.
వాటిలో నిజానిజాలు ఎలాగున్నపటికీ అధ్యక్ష పీఠం మీద కూర్చోనక మునుపే ట్రంప్ ఇన్ని వివాదాలను ఎదుర్కొనవలసి రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో అమెరికన్ మీడియా ట్రంప్ పట్ల తీవ్ర వ్యతిరేకత చూపింది. కానీ ఆయన మరొక వారం రోజులలో అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టబోతున్న ఈ సమయంలో కూడా ఆయన పట్ల ఇంత వ్యతిరేకత ప్రదర్శించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక మున్ముందు డోనాల్డ్ ట్రంప్ ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తారో..ఎదుర్కొంటారో?