అంతం కాదిది ఆరంభం: మన్మోహన్

మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ఒక రాజకీయవేత్త కంటే గొప్ప ఆర్ధికవేత్త అని తెలిసిందే. అదేవిధంగా మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి పి.చిదంబరం కూడా గొప్ప ఆర్ధికవేత్తే. వారిద్దరూ నోట్ల రద్దు నిర్ణయాన్ని చాలా ఘోర తప్పిదమని వాదిస్తున్నారు. దాని వలన భవిష్యత్ లో తీవ్ర అనర్ధాలు జరుగాబోతున్నాయని, దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారబోతోందని హెచ్చరిస్తున్నారు. 

నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ డిల్లీలో నిర్వహించిన ‘జన్ వేదన్’ (జనుల వేదన) సభలో డా.మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ “నోట్ల రద్దు వలన ఏర్పడిన సమస్యలకు అంతం కాలేదు. అవి ఇప్పుడే ఆరంభం అయ్యాయి. మున్ముందు పరిస్థితులు ఇంకా దిగజారబోతున్నాయి. నోట్ల రద్దు ఒక వినాశకరమైన నిర్ణయం అని రుజువు కాబోతోంది. గత రెండున్నరేళ్ళలో జాతీయ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని మోడీ చెప్పుకొంటున్న మాటలన్నీ అబద్దాలే. ఇదివరకు 7.6 శాతం ఉన్న గ్రోత్ రేట్ గత కొన్ని నెలలోనే 7.0 శాతానికి పడిపోయింది. కనుక మోడీ తప్పుడు ప్రచారం గురించి ప్రజలను హెచ్చరించవలసిన బాధ్యత మన అందరి మీదే ఉంది,” అని హెచ్చరించారు. 

ఇక చిదంబరం కూడా అదేవిధంగా హెచ్చరించారు. నోట్ల రద్దు చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ మన బలమైన ఆర్ధిక వ్యవస్థను దళా దారుణంగా దెబ్బ తీశారని, అది మళ్ళీ కోలుకోవడానికి చాలా సమయం పట్టవచ్చని అన్నారు. జిడిపిలో ఒక్క శాతం తగ్గినా అది రూ.1.5 లక్షల కోట్లు నష్టానికి దారి తీస్తుందని చెప్పారు. ఇంతవరకు దేశాన్ని పాలించిన ఏ ప్రభుత్వం కూడా రిజర్వ్ బ్యాంక్ ను ప్రభుత్వంలో ఒక శాఖలాగ భావించి ఈవిధంగా అనుచితంగా వ్యవహరించలేదని కానీ మోడీ వ్యవహరించి దాని ప్రతిష్టను దెబ్బ తీశారని అన్నారు.