తూచ్..నేను డిల్లీ ముఖ్యమంత్రినే!

ఫిబ్రవరి 4న పంజాబ్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆమాద్మీ పార్టీ కూడా అక్కడ పోటీ చేస్తోంది. “ఆమాద్మీ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే అరవింద్ కేజ్రీవాల్ ని పంజాబ్ ముఖ్యమంత్రిగా చూడవచ్చుని” డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా మొన్న ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట చాలా సంచలనం సృష్టించింది. అయితే ఆయన దానిపై మళ్ళీ వివరణ ఇస్తూ “ఆమాద్మీ పార్టీని గెలిపిస్తే పంజాబ్ ని అభివృద్ధి చేసే బాధ్యత అరవింద్ కేజ్రీవాల్ దేనని, కనుక అరవింద్ కేజ్రీవాల్ ని చూసి తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని” చిన్న సవరణ ప్రకటన చేశారు. 

కానీ శిసోడియా చేసిన ఆ రెండో ప్రకటనను కాంగ్రెస్, భాజపాలు అందిపుచ్చుకొని “ఒకవేళ ఆమాద్మీ పార్టీని గెలిపించినట్లయితే, అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ నుంచి పంజాబ్ ను రిమోట్ పద్దతిలో పరిపాలించబోతున్నారని కనుక రిమోట్ పాలన చేసే బయటి పార్టీను దూరంగా ఉంచండి,” అని ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. వెంటనే అప్రమత్తమైన అరవింద్ కేజ్రీవాల్ ఈ గందరగోళానికి తెర దించుతూ ఈరోజు పాటియాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో తాను డిల్లీకే ముఖ్యమంత్రిగా ఉంటానని, పంజాబ్ నుంచి ఎన్నికైన వ్యక్తే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని, అతను లేదా ఆమే పంజాబ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తారని వివరణ ఇచ్చారు.