మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్:150 సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే రివ్యూలు కూడా వచ్చేసాయి. ఊహించినట్లు అన్నీ పాజిటివ్ గానే ఉన్నాయి. కధ చాలా పాతదే అయినప్పటికీ దర్శకుడు వివి వినాయక్ దానిని గొప్పగా ట్రీట్ చేసిన విధానం వలన అందరినీ ఆకట్టుకొంటోంది. పైగా సుమారు ఒక దశాబ్దం తరువాత మెగాస్టార్ నటించిన సినిమా కనుక ఓపెనింగ్స్ కూడా చాలా బారీగానే ఉన్నాయి.
సాధారణంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడని చిరంజీవి, ఈరోజు తన సినిమా విడుదలవుతున్న దృష్ట్యా మీడియాతో మాట్లాడారు. ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి చిరంజీవి ఈవిధంగా శ్రమ తీసుకోవడం చూస్తుంటే దాని గురించి ఆయన కూడా చాలా టెన్షన్ తో ఉన్నట్లు అర్ధం అవుతోంది.
ఇక అసలు విషయంలోకి వస్తే, ఆయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్, అతని రాజకీయ విధానం గురించి చాలా వివరంగా మాట్లాడటం విశేషం.
పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఏమి చెప్పారంటే, “పవన్ కళ్యాణ్ న్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కలాగే ఉన్నాడు. పవన్ నలుగురితో కలవడానికి ఎక్కువగా ఇష్టపడడు. అలాగే తను అనుకొన్నది సాధించేవరకు ఊరుకోడు. ఖైదీ నెంబర్:150 ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగి ఉండి ఉంటే తప్పక వచ్చి ఉండేవాడేమో. తమ్ముడి మనస్తత్వం గురించి నాకు తెలుసు కనుక తను వచ్చినా రాకపోయినా నేనేమి అనుకోను.
పవన్ కళ్యాణ్ అందరికీ పూర్తి భిన్నంగా తనదైన శైలిలో రాజకీయాలలో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. చిరకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేస్తూ వాటి పరిష్కారాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ముందుకు సాగుతున్నాడు. కనుక అధికారం కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికే పవన్ కళ్యాణ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని స్పష్టం అవుతోంది. ప్రస్తుతం సమస్యలను హైలైట్ చేసి వాటి పరిష్కారం కోసం పోరాటం మాత్రమే చేయగలడు. అదే...అధికారంలోకి వస్తే ఆ సమస్యలను స్వయంగా పరిష్కరించగలడు. అతనికో ఐడియాలజీ ఉంది. ఏమి చేయాలో ఒక లక్ష్యం ఉంది. అవి చెయ్యాలనే తపన చాలా ఉంది. నలుగురితో కలువలేని అతని మనస్తత్వాన్ని చూసే బదులు అతనిలో ఈ గొప్ప లక్షణాలను అందరూ చూడగలిగితేసినట్లయితే, అటువంటి వ్యక్తులే నేడు మనకి చాలా అవసరమని అంగీకరిస్తారు. రాజకీయాలలో సమూల ప్రక్షాళన జరగాలని అందరూ కోరుకొంటారు. కనుక అటువంటి ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ న్ను అందరూ ఆదరిస్తే బాగుంటుంది. మా ఇద్దరి ఆలోచనావిధానం, వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు అన్నీ భిన్నంగా ఉంటాయి. కనుక భవిష్యత్ లో కూడా మేమిద్దరం రాజకీయాలలో కలిసి పని చేయలేకపోవచ్చు. అతను రాజకీయ భవిష్యత్ ఏవిధంగా ఉంటుందో ఇప్పుడే నేను చెప్పలేను కానీ అతను తప్పకుండా విజయవంతం అవ్వాలని కోరుకొంటున్నాను,” అని చిరంజీవి అన్నారు.