తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, తెదేపా, భాజపాలు నిర్వీర్యం అయిపోవడంతో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయాలనే ఉద్దేశ్యంతో సిపిఐ (ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహాజన పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. తద్వారా ప్రజా సమస్యలపై పోరాడుతూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని సిపిఐ (ఎం) ఆలోచన. ఒకపక్క ఆయన పాదయాత్రలు చేస్తుంటే మరోపక్క పార్టీ ఖాళీ అయిపోతుండటం విశేషం. సూర్యాపేటకు చెందిన సుమారు 200 మంది సిపిఐ, సిపిఐ (ఎం) పార్టీల కార్యకర్తలు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో మంగళవారం తెరాసలో చేరిపోయారు. వామపక్షాల సిద్దాంతాలు, విధానాలు అవుట్ డేటడ్ అయిపోయాయని, అవి నేటి సమాజానికి పనికిరావని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
జగదీశ్ రెడ్డి చెప్పిన ఆ సంగతి వామపక్ష నేతలకు, వాటి అధిష్టానానికి తెలియవనుకోలేము. కానీ వారు ఇంకా తమ పాత విధానాలనే పట్టుకొని వ్రేలాడుతున్నందునే ప్రజాధారణకు నోచుకోవడం లేదని చెప్పవచ్చు. ప్రజా సమస్యలపై దేశంలో మరే ఇతర పార్టీలు పోరాడనంతగా వామపక్షాలు నిత్యం పోరాడుతూనే ఉంటాయి. అయినా వారు ఎన్నడూ అధికారంలోకి రాలేకపోవడానికి కారణం అదేనని చెప్పవచ్చు. దేశంలో రాజకీయ పార్టీలన్నీ ఏదో విధంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తుంటాయి. కానీ వామపక్షాలు మాత్రం అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి, పోరాటాలు చేయడానికే పరిమితం అవుతుంటాయి. బహుశః అందుకే భావసారూప్యత కలిగిన పవన్ కళ్యాణ్ తో చేతులు కలపాలని ప్రయత్నిస్తున్నాయేమో? రాష్ట్రంలో తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో సాగుతున్న మహాజన పాదయాత్ర వలన కూడా ఆ పార్టీకి ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. ఉండకపోయినా వామపక్షాలు బాధపడవు కూడా.