రాహుల్ లేని రాజకీయాలు...

రాహుల్ గాంధీ లేని రాజకీయాలు ఉప్పు లేని వంటలా, కమేడియన్ లేని కామెడీ సినిమాలా ఉంటాయని చెప్పకతప్పదు. దేశ రాజకీయాలను ఆయన ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయినా ఆయన లేకపోతే అవి రక్తి కట్టవు. బహుశః ఆ సంగతి ఆయన కూడా తెలిసే ఉంటుంది అందుకే దేశంలో ఎంత పెద్ద సమస్యలున్నా, ఎంత కీలకమైన రాజకీయ పరిణామాలు జరుగుతున్నా ప్రతీ ఏట విదేశాలలోనే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొని తిరిగి వస్తుంటారు. ఈసారి కూడా అలాగే చేశారు. 

ఈసారి ఆయన విదేశాలలో వేడుకలు జరుపుకొంటుంటే, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కి చాలా కీలకమైన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఐదు  రాష్ట్రాలకు అభ్యర్ధుల పేర్లను, ఎన్నికల వ్యూహాలను ఖరారు చేయడం, యూపిలో సమాజ్ వాదీ పార్టీతో పొత్తులు వంటి అనేక అత్యవసరమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. రాహుల్ గాంధీ మొన్న విదేశాల నుంచి తిరిగి రాగానే వాటి సంగతి చూడటం మొదలుపెట్టారు. రాహుల్ గాంధీ అధ్యక్షతన డిల్లీలో నిన్న “ప్రజా వేదన్” (ప్రజల వేదన) పేరిట ఒక సమావేశం నిర్వహించారు. దానిలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొని నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై చర్చించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నోట్ల రద్దు వలన ప్రజలకు కలిగిన ఇబ్బందులను హైలైట్ చేసి, మోడీ ప్రభుత్వంపై ప్రజాగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని నిర్ణయించారు.

నోట్ల రద్దు చేసినప్పుడు దానిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు లోపలా బయటా చాలా గట్టిగానే పోరాడింది. ఆ సమయంలో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు కనుక దాని పోరాటాలు సమయోచితంగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు అది గడిచిపోయిన పాత సమస్య. ప్రజలకు అవసరమైనంత నగదు అందుబాటులోకి వస్తుంనందున, దేశంలో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకొంటున్నాయి. అందుకే మీడియాలో కూడా ఇప్పుడు ఆ వార్తలు పెద్దగా కనిపించడం లేదు. కానీ విదేశాలలో తిరిగి వచ్చిన రాహుల్ గాంధీ ఆ విషయం గ్రహించినట్లు లేరు. అందుకే నోట్ల రద్దు కష్టాలను హైలైట్ చేయాలనుకొంటున్నారు. అందుకే దేశ రాజకీయాలలో రాహుల్ గాంధీ కామెడీ షో అవసరం చాలా ఉంది.