ఆమాద్మీ పార్టీ అధినేత, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురించి చాలా ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. తన పార్టీని పంజాబ్ కి కూడా విస్తరించాలని కలలుకంటున్న అయన ఫిబ్రవరి 4న జరుగబోయే ఎన్నికలలో తమ పార్టీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు పంజాబ్ లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా ప్రసంగిస్తూ ఆమాద్మీ పార్టీకి ఓటు వేసి గెలిపించినట్లయితే పంజాబ్ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ని చూడవచ్చని అన్నారు.
డిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎన్నికలలో పోటీ చేయవలసి ఉంటుంది. బహుశః అందుకే ఇంతవరకు ఆమాద్మీ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించలేదేమో? కానీ ఒకవేళ పంజాబ్ లో పోటీ చేయాలంటే అరవింద్ కేజ్రీవాల్ ముందుగా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది. రాజీనామా చేసి బరిలో దిగిన తరువాత ఒకవేళ ఆమాద్మీ పార్టీ ఎన్నికలలో ఓడిపోతే అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి రెంటికీ చెడినట్లవుతుంది.
ఈసారి పంజాబ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు జోస్యం చెపుతున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసి బరిలోకి దిగినట్లయితే అది దుస్సాహసమే అవుతుంది. పంజాబ్ లో ఫిబ్రవరి 4న ఒకే దశలో ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక, నేడోరేపో అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్ధిత్వం గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.