రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి సమ్మె కొనసాగిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను సున్నితంగా హెచ్చరించారు. గురువారంలోగా విధులలో చేరాలని, లేకుంటే క్రమబద్దీకరణ అవకాశం కోల్పోతారని లెక్చరర్లను హెచ్చరించారు. వారి జీతాలు 50శాతం పెంచి, సర్వీసులను క్రమబద్దీకరించేందుకు మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదం తెలిపామని, వారందరినీ జీవో నెంబర్: 16 ప్రకారం క్రమబద్దీకరణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన తరువాత కూడా ఇంకా ఎందుకు సమ్మె చేస్తున్నారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. కొన్ని ప్రతిపక్ష పార్టీల ప్రోద్భలంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు సమ్మె కొనసాగిస్తున్నారని తమకు తెలుసని కడియం అన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నప్పుడు కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లు సమ్మె కొనసాగించదలచుకొంటే చివరికి వారే నష్టపోతారని హెచ్చరించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సానుభూతితో వ్యవహరించి వారి డిమాండ్లకు అంగీకరించారని చెప్పారు. ఫిబ్రవరి, మార్చి నెలల నుండి విద్యార్ధులకు పరీక్షలు మొదలవుతాయి కనుక కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరూ తక్షణం సమ్మె విరమించి విధులలో చేరాలని లేకుంటే చర్యలు తప్పవని కడియం హెచ్చరించారు.
క్రమబద్దీకరణ, జీతల పెంపు గురించి కడియం ప్రకటన, హెచ్చరికలతో సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లలో కొంత మంది సమ్మె విరమించడమే కాకుండా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. రేపటి నుంచే తాము విధులలో చేరుతామని తెలిపారు. మిగిలిన కాంట్రాక్ట్ లెక్చరర్లు కూడా రేపటి నుంచి విధులలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.