“మా పార్టీలో ఎటువంటి గొడవలు లేవు. పార్టీ చీలిపోయే అవకాశాలే లేవు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఒక్కటిగానే ఎన్నికలను ఎదుర్కొని మళ్ళీ అధికారంలోకి వస్తాం. అఖిలేష్ యాదవే మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉంటారు,” అని ములాయం సింగ్ లక్నోలో మీడియాతో అన్నారు.
కానీ ఆయన మాటల్లోనే తమ సమాజ్ వాదీ పార్టీలో గొడవలున్నాయని, అది నిలువునా చీలిపోయే అవకాశం ఉందని, కానీ చీలిపోకుండా దానిని కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకోసం తనే ఒక మెట్టు దిగి కొడుకుకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడానికి సిద్దం అయ్యానని చెప్పుకొంటున్నట్లు అర్ధం అవుతోంది.
అంతా సవ్యంగా ఉందని చెపుతూనే డిల్లీలో తండ్రికొడుకులు ఇద్దరూ ఎన్నికల కమీషన్ వద్ద తమ పార్టీపై, దాని ఎన్నికల చిహ్నం కోసం కీచులాడుకొంటున్నారు. ఒకవైపు డిల్లీలో పార్టీపై ఆధిపత్యం కోసం కీచులాడుకొంటూనే మళ్ళీ ఇద్దరూ ఇవ్వాళ్ళ లక్నోలో సుమారు గంటన్నర సేపు సమావేశం అయ్యారు. కానీ వారి మద్య పడిన పీఠముడులు విడదీయడం సాధ్యం కాదని ఇద్దరికీ తెలుసు.
పార్టీపై తనకు పూర్తి ఆధిపత్యం, ఎన్నికలలో అభ్యర్ధులకు టికెట్స్ కేటాయించే అధికారం తనకే కావాలని, పార్టీ నుంచి అమర్ సింగ్ ను బయటకు పంపించేయాలని అఖిలేష్ యాదవ్ షరతులు పెడుతున్నారు. కానీ వాటిలో ఏ ఒక్కటికీ తండ్రికి, బాబాయ్ శివపాల్ యాదవ్ కి ఆమోదం కాదు. కనుక పార్టీలో చీలిక అనివార్యంగానే కనిపిస్తోంది.
ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని, ప్రజలను, పాలనను గాలికి వదిలేసి, పార్టీపై పట్టు కోసం కీచులాడుకొంటున్న తమ గురించి ప్రజలు ఏమనుకొంటున్నారు? అసలు వాళ్ళు మళ్ళీ తమకు ఎందుకు ఓటేస్తారు? అని తండ్రికొడుకులు ఇద్దరూ ఆలోచించలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పార్టీపై ఎవరు ఆధిపత్యం సాధించగలిగితే వారినే ప్రజలు ఎన్నుకొని అధికారం కట్టబెట్టేస్తారనట్లు ఇద్దరూ వ్యవహరిస్తున్నారు. వారి కీచులాటల వలన వారిపై ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకత భాజపా, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలకు సానుకూల అంశంగా మారే అవకాశం ఉంది.