కేజ్రీవాల్ భలే చెప్పారు

ప్రధాని మోడీకి ఆయన తల్లి హీరాబెన్ ఆహరమో స్వీట్లో తినిపిస్తున్నట్లు లేదా ఆయనే ఆమెకి తినిపిస్తున్నట్లు మీడియాలో చాలాసార్లు ఫోటోలు వస్తుంటాయి. అందుకు వారిని తప్పు పట్టలేము కానీ అవన్నీ తల్లి పట్ల తనకు చాలా గౌరవం, ప్రేమాభిమానాలు ఉన్నాయని ప్రచారం చేసుకొంటున్నట్లు ఉంటాయి. ఆయన గుజరాత్ లో జరుగుతున్న ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవ్వాళ్ళ అహ్మదాబాద్ వెళ్ళారు. ఆ సందర్భంగా అయన తన తల్లిని కలుసుకొని ఆమెతో పలహారం చేశానని, ఇద్దరం కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకొంటూ కాలక్షేపం చేశామని, అందుకే ఈ రోజు తను యోగాభ్యాసం చేయలేకపోయానని ట్వీట్ చేశారు. తల్లిని కలిసి ఆమె యోగక్షేమాలు తెలుసుకొని ఆమెతో కలిసి పలహారం చేయడం అసాధారణమైన విషయమేమీ కాదని అందరికీ తెలుసు. కానీ దాని గురించి కూడా ఆయన ట్వీట్ చేయడంతో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చాలా చక్కగానే స్పందించారు. 

“హిందూమత విధానాల ప్రకారం ప్రతీ వ్యక్తి తన తల్లిని, భార్యని తన వద్దే ఉంచుకొని కలిసి జీవించాలి. మోడీ ఉంటున్న ఇల్లు చాలా పెద్దది కనుక అయన తన తల్లిని తన వద్దే ఉంచుకొంటే మంచిది. నా తల్లి నా దగ్గరే ఉంటుంది. రోజూ నేను ఆమె ఆశీర్వాదం తీసుకొంటాను. కానీ మోడీలాగ నేను గొప్పగా చాటింపు వేసుకోను. ఆయన తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్దురాలైన తల్లిని బ్యాంక్ వద్ద క్యూ లైన్లో నిలబెట్టడానికి కూడా వెనుకాడలేదు,” అని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 

ప్రముఖుల వ్యక్తిగత జీవితాలలోకి ఎవరైనా తొంగి చూస్తే వారికి చాలా ఆగ్రహం కలుగుతుంది. అది సహజమే. కానీ ఇటువంటి వ్యక్తిగత విషయాలను మోడీ స్వయంగా మీడియాకు అందజేయడం ద్వారా మీడియాకు ఆ అవకాశం ఆయనే కల్పిస్తున్నట్లు అవుతోంది. తల్లి పట్ల అభిమానం చూపించడం మెచ్చుకోవలసిన విషయమే కానీ అది మీడియాకు తెలియజేయవలసిన అవసరం లేదు. కానీ తెలియజేస్తున్నారంటే అయన ప్రచారం కోరుకొంటున్నారని భావించవలసి వస్తోంది. తన తల్లి పట్ల తను చూపుతున్న ప్రేమాభిమానాలను లోకానికి తెలియాలనుకొంటారు కానీ ఆయన ఏనాడూ తన ఆర్దాంగి ప్రస్తావనే చేయరు. ఒకవేళ ఆ విషయం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే అది ఆయన వ్యక్తిగత జీవితంలో కలుగజేసుకోవడమే అనే వాదన వినిపిస్తుంటుంది.