రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న కుమారుడు జోగు ప్రేమేందర్ ఆయన అనుచరుల పై హత్యానేరం క్రింద అదిలాబాద్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కాటిపల్లి తిరుపతి రెడ్డి, అతని సోదరుడు మహిపాల్ రెడ్డి ఇద్దరూ ఒకప్పుడు తెరాస చేపట్టిన తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. వారిరువురూ జోగు రామన్న ముఖ్య అనుచరులుగా మెలిగేవారు. 2014 ఎన్నికలలో జోగు రామన్న తరపున ఇద్దరూ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కానీ ఆయన మంత్రి అయిన తరువాత తమను పట్టించుకోవడం లేదనే కారణంతో వారిరువురూ ఆయనకు దూరమయ్యి ప్రత్యర్ధి వర్గానికి దగ్గరయినప్పటి నుంచి వారి మద్య శత్రుత్వం ఏర్పడి అది పోలీసు కేసుల వరకు వెళ్ళింది. ఒక కేసులో తిరుపతి రెడ్డి నెలరోజులు జైలుకి వెళ్ళి వచ్చాడు. మొన్న శనివారం తిరుపతి రెడ్డి అనుమానాస్పద పరిస్థితులలో మరణించాడు.
అతనిని మంత్రి గారి కొడుకు ప్రేమేందర్ రెడ్డే హత్య చేయించాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానీ ఆ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు అతను ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేయడంతో జిల్లాలో ప్రతిపక్షాలన్నీ తిరుపతి రెడ్డి కుటుంబానికి అండగా నిలబడి ధర్నా చేసి ఒత్తిడి తెచ్చిన తరువాత మంత్రి కుమారుడుతో బాటు అతని 8మంది అనుచరులపై సెక్షన్స్ 308, 109, 74ల క్రింద కేసులు నమోదు చేశారు. కొడుకుపై హత్యానేరం కేసు నమోదు కావడంతో మంత్రి జోగు రామన్న చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేసు విషయంలో ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.