తెరాస-ప్రొఫెసర్ కోదండరామ్ మద్య జరుగుతున్న యుద్ధం నానాటికీ తీవ్రం అవుతోంది. అది చివరికి ఏ మలుపు తీసుకొంటుందో ఊహించడం కష్టమే. ఎందుకంటే ఆయన రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదని, అన్ని రాజకీయ పార్టీలతో సమాన దూరం పాటిస్తామని చెపుతున్నారు కనుక! కానీ అయన కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన ఏర్పరచుకొని రాష్ట్రంలో దానిని అధికారంలోకి తీసుకురావడానికే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన రాజకీయాలలోకి వస్తారా లేదా? వస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతారా లేదా? అనేవి అప్రస్తుత అంశాలు కనుక వాటిని పక్కన బెట్టి చూస్తే, ఇకపై ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గే ఉద్దేశ్యంలో లేనట్లే ఉన్నారు.
నిన్న ఒకేరోజున రెండు వేర్వేరు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ప్రాజెక్టుల కోసం బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, తెదేపా నేతలతో కలిసి హైదరాబాద్ లో నిన్న ఒక సమావేశం నిర్వహించి సెక్షన్ 123 ప్రకారం భూసేకరణ చేయరాదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ బలవంతపు భూసేకరణకు ప్రయత్నిస్తే రైతుల తరపున నిలిచి ప్రభుత్వంతో గట్టిగా పోరాడుతామని ప్రొఫెసర్ కోదండరామ్ హెచ్చరించారు.
శంషాబాద్ లో సిపిఎం పార్టీ అనుబంద విద్యార్ధి సంఘం అధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరామ్, తెరాస సర్కార్ తెచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ అధ్వర్యంలో నడుస్తున్న 11 యూనివర్సిటీలను ప్రభుత్వం పట్టించుకోకుండా కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు వీలు కల్పించడాన్ని ప్రొఫెసర్ కోదండరామ్ తప్పు పట్టారు. వాటి వలన ప్రభుత్వ యూనివర్సిటీలు చాలా దెబ్బ తినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠాశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలలో అవసరమైన మౌలికవసతులు, భోధనా సిబ్బంది, నిధులు అన్నీ ఏర్పాటు చేసి వాటిని మరింత బలోపేతం చేసినట్లయితే రాష్ట్రంలో లక్షలాది మంది బడుగు బలహీన వర్గాలకు మంచి నాణ్యమైన విద్యనభ్యసించే అవకాశం ఉంటుందని, అదే ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు అయితే కేవలం ధనికుల పిల్లలకు మాత్రమే వాటిలో చదువుకొనే అవకాశం ఉంటుందని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.
తమ ప్రభుత్వం చేపట్టే ప్రతీ పనిని, నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కారణంగా తెరాస సర్కార్ కు ఆయనపై ఆగ్రహం కలగడం సహజమే. బహుశః అందుకేనేమో తెరాస అనుకూల విద్యార్ధి సంఘాలు తార్నాకలోని ప్రొఫెసర్ కోదండరామ్ ఇంటిని చుట్టుముట్టి నిరసనలు తెలిపారు. నిర్వాసితుల పేరిట ఆయన రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుతగులుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ కోదండరామ్ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన విద్యార్ధులను పోలీసులు చెదరగొట్టి పంపించేశారు. కానీ అది ఆయనపై భౌతిక దాడులకు జరిగిన మొట్టమొదటి ప్రయత్నంగానే చూడవలసి ఉంటుంది. ప్రొఫెసర్ కోదండరామ్ తన తీరు మార్చుకోకపోతే అటువంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని తెరాస ఎంపి బాల్క సుమన్ కొన్ని రోజుల క్రితమే హెచ్చరించారు. కనుక వారి చర్యను ఆవిధంగానే భావించక తప్పదు.
తమ ప్రభుత్వ విధానాలను ఆయన వ్యతిరేకిస్తున్నారు కనుక ఈవిధంగా భౌతిక దాడుల ద్వారా అణచివేయాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత, ఆయన పట్ల సానుభూతి పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణా సాధన కోసం ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన పోరాటాల వలన రాష్ట్ర ప్రజలకు ఆయనపై చాలా గౌరవం ఉంది. కనుక తెరాస సర్కార్ అది దృష్టిలో ఉంచుకొని ఆయనతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.