యూపిలో అధికార సమాజ్ వాదీ పార్టీలో తండ్రికొడుకుల మద్య జరుగుతున్న ఆధిపత్యపోరు క్లైమాక్స్ కు చేరుకొంది. ఆ పార్టీ, దాని ఎన్నికల చిహ్నం నాదంటే నాదని కీచులాడుకొంటున్న వారిరువురినీ తమ బలాబలాలను నిరూపించుకోవలసిందిగా కేంద్ర ఎన్నికల కమీషన్ కోరింది. వారికిచ్చిన గడువు నేటితో ముగుస్తుండటంతో మూలాయం సింగ్ మళ్ళీ నిన్న మీడియా ముందుకు వచ్చి ఆ పార్టీ తనదేనని, తన కొడుకు అఖిలేష్ యాదవ్ కేవలం రాష్టానికి ముఖ్యమంత్రి మాత్రమేనని స్పష్టం చేశారుపార్టీ నుంచి బహిష్కరింపబడిన తన సోదరుడు రాం గోపాల్ యాదవ్ కి ఎటువంటి అధికారం లేకపోయినా జనవరి 1న పార్టీ జాతీయ సదస్సు నిర్వహించడాన్ని ములాయం తప్పుపట్టారు.
ఆ సదస్సులో పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న మూలాయం సింగ్ ను, రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ లను తొలగించి వారి స్థానంలో అఖిలేష్ యాదవ్, అతని అనుచరుడు జాతీయ, రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకొంటూ తీర్మానాలు చేసి ఆమోదించారు. తండ్రి కంటే కొడుకుకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, పార్టీ కార్యకర్తలు మద్దతు ఇస్తున్నందున, పార్టీ దాని ఎన్నికల చిహ్నమైన సైకిల్ తమదేనని అఖిలేష్ యాదవ్ వర్గం వాదిస్తోంది. కనుక తన పార్టీని, దానిపై తన ఆధిపత్యాన్ని కాపాడుకొనేందుకు ములాయం సింగ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు ఆయన కేంద్ర ఎన్నికల కమీషన్ న్ను కలవబోతున్నారు. వారిరువురూ సమర్పించిన వివరాలను పరిశీలించిన తరువాత ఎన్నికల కమీషన్ ఒక నిర్ణయం తీసుకొంటుంది.