శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితుల సమస్యలను పట్టించుకోనందుకు తెదేపా ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన జనసేనానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూల స్పందనతో చాలా సంతృప్తి చెందారు. అదే విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేశారు కూడా. కాకపోతే స్థానిక మంత్రి అచ్చెం నాయుడు కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ సమస్య తీవ్రతను బాగా అర్ధం చేసుకొని తక్షణమే స్పందించారని బాబుని ప్రశంసిస్తూ మంత్రిగారికి ఆ చేత్తోనే చురకలు కూడా వేశారు.
పవన్ కళ్యాణ్ ట్వీట్ సారాంశం ఏమిటంటే, “ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పట్ల శ్రీ చంద్రబాబు నాయుడూజీ చూపిన సానుకూల స్పందనను జనసేన స్వాగతిస్తోంది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొన్ని చర్యలు ఆ సమస్య పరిష్కారం కోసం వేసిన మొదటి అడుగు. ఈ సమస్య తీవ్రత, బాధితుల కష్టాల గురించి స్థానిక మంత్రి అచ్చెంనాయుడు కంటే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుజీ బాగా అర్ధం చేసుకొన్నారు. ఉద్దానం సమస్య పరిష్కరించడం రాష్ట్రంలో అన్ని పార్టీలకు ఒక సామాజిక బాధ్యత. దానిని పూర్తిగా పరిష్కరించేవరకు అన్ని పార్టీలు దానిని తమ మ్యానిఫెస్టోలో కూడా చేర్చాలి. ఈ సమస్య శాస్వితంగా పరిష్కారం అయ్యేవరకు ప్రజా సంఘాలు, మేధావులు, వైద్యులు, స్వచ్చంద సంస్థల కార్యకర్తలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని వారందరూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రాజకీయ పార్టీలన్నిటిపై ఒత్తిడి చేస్తుండాలి. రానున్న రోజులలో జనసేన పార్టీ ఈ ఒక్క సమస్యే మీదే కాకుండా ఉత్తరంద్రా వెనుకబాటుతనానికి గల అన్ని సమస్యలపై దృష్టి పెట్టబోతోంది. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి మాకు అండగా నిలిచిన మీడియా మిత్రులు అందరికీ బాధితుల అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఇక ముందు కూడా ఇలాగే మీరందరూ ఇలాగే మద్దతు ఇవ్వాలని కోరుకొంటున్నాను. జై హింద్.”