శాసనసభ, మండలి సమావేశాలు సమాంతరంగా జరుగుతున్నప్పటికీ ప్రజలు, మీడియా కూడా శాసనసభ సమావేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు తప్ప మండలిలో జరిగే చర్చలను ఎవరూ పట్టించుకోరని మండలి చైర్మన్ కె. స్వామి గౌడ్ అన్నారు. ఆయన మాటలు నిజమని అందరూ అంగీకరించక తప్పదు. రాజకీయ పార్టీలలో రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికే శాసన మండలిని ఏర్పాటు చేశారనే ఒక అపవాదు ఉంది. దాని వలన ప్రజాధనం వృధా చేయడం తప్ప మరే ప్రయోజనం లేదని భావించిన సమైక్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ దానిని రద్దు చేశారు. అదే విషయం హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి స్వామి గౌడ్ కి చెప్పారు. కాకపోతే బొత్తిగా లౌక్యం తెలియని ఆయన బయటకు చెప్పకూడని అందరికీ తెలిసిన చేదు నిజాలను మీడియా ప్రతినిధుల సమక్షంలోనే స్వామి గౌడ్ తో చెప్పేయడంతో ఆయన చాలా ఇబ్బందిపడ్డారు.
“ప్రత్యక్ష ఎన్నికలలో గెలవలేనివాళ్ళు, ప్రజాధారణ లేనివాళ్ళే శాసనమండలికి వస్తుంటారు. అందుకే 1983లో ఎన్టీఆర్ దానిని రద్దు చేస్తానంటే నేనూ మద్దతు ఇచ్చాను,” అని అన్నారు. ఇప్పుడు అదే మండలిని నడిపిస్తున్న స్వామి గౌడ్ మీడియా ప్రతినిధుల ముందు నాయిని నోట ఆ మాటలు విన్నప్పుడు షాక్ అయ్యారు. కానీ నాయిని చాలా సీనియర్ కావడంతో మౌనం వహించక తప్పలేదు.