బాలయ్య ఇలా... చంద్రబాబు అలా..

ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ బద్ద శత్రువులులాగ వ్యవహరిస్తుండటం తెలిసిందే. అలాగే రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి తదితర తెదేపా నేతలు కూడా కేసీఆర్ పై, తెరాస సర్కార్ పై నిత్యం తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. కానీ తెదేపా హిందూపురం ఎమ్మెల్యే, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తో చక్కటి సంబంధాలు కలిగి ఉండటం విశేషం. బాలకృష్ణ స్వయంగా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి తను నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి ప్రీవ్యూ చూసేందుకు రావలసిందిగా ఆహ్వానించారు. అందుకు ఆయన అంగీకరించారో లేదో తెలియదు కానీ ఆ చిత్రానికి వినోదపన్ను మినహాయింపునిస్తున్నట్లు తెలిపారు.

గ్రేటర్ ఎన్నికల ప్రచారం సమయంలో తెదేపా నేతలు కేసీఆర్ ని, ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నప్పుడు కూడా బాలకృష్ణ కేసీఆర్ ని కలిసి వచ్చారు. అదే.. బాలకృష్ణకు బదులు మరెవరైనా తెదేపా నేతలు లేదా ఎమ్మెల్యేలు కేసీఆర్ ని కలిసి ఉండి ఉంటే వారు పార్టీ మారబోతున్నారని ప్రచారం మొదలయిపోయేది. లేదా వారిపై వేటు పడి ఉండేది. అయితే బాలకృష్ణకు ఆ ఆలోచనలు, అవకాశాలు కూడా లేవు కనుక ఎవరూ ఆయనను అనుమానించలేరు. కానీ ఒకవైపు ఆయన వియ్యంకుడు, తెలంగాణా తెదేపా నేతలు కేసీఆర్ తో యుద్దాలు చేస్తుంటే, వాటితో తనకేమీ సంబంధం లేదన్నట్లు బాలకృష్ణ కేసీఆర్ ని కలుస్తుండటం కొంచెం సినిమాటిక్ గానే ఉంది. తెలంగాణా తెదేపా నేతలు పైకి చెప్పుకోలేకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ తో బాలకృష్ణ స్నేహం వారికీ చాలా ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పవచ్చు.