స్మార్ట్ ఫోన్స్ పై రాయితీలా?

స్మార్ట్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లపై వాటి తయారీదార్లు లేదా వాటిని అమ్మే దుఖాణాలు బారీగా డిస్కౌంట్లు ప్రకటించడం మామూలే. కానీ ప్రభుత్వం కూడా స్మార్ట్ ఫోన్లు కొనుగోలుకి రాయితీలు ఇవ్వడం ఎన్నడూ చూసి ఉండము. ఆ పని ఏపి సర్కార్ చేయబోతోంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి స్మార్ట్ ఫోన్లపై రూ.1,000 రాయితీ ఇవ్వాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నిన్న తెలిపారు. 

సామాన్య ప్రజలు నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలంటే వారికి డెబిట్ కార్డులు, దుఖాణదారులకి స్వైపింగ్ మెషిన్లు ఇస్తే సరిపోతుంది. మొబైల్ బ్యాంకింగ్ కంటే అదే సులువు సురక్షితం కూడా. వాటిని నిరక్షరాస్యులు కూడా వాటిని వినియోగించగలరు. కానీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం స్మార్ట్ ఫోన్స్ కొనుగోలుకి రూ. 1,000 రాయితీ ఇవ్వాలనుకోవడం చాలా విచిత్రంగా ఉంది. దాని వలన అనుకొన్న ఆశయం నెరవేరకపోగా దుర్వినియోగం అయ్యే అవకాశాలే ఎక్కువ. దానితో ప్రభుత్వం మీద ఆర్ధిక భారం పడుతుంది కూడా. 

తెలంగాణా రాష్ట్రంలో ఒంటరి మహిళలకు నెలకు రూ. 1,000 ఇస్తానని కేసీఆర్ ప్రకటించిన రోజునే ఏపి సిఎం ఈ స్మార్ట్ రాయితీ ప్రకటన చేయడం యాదృచ్చికమే కానీ ఆ రెంటినీ పోలిస్తే కేసీఆర్ ఇవ్వబోతున్న పెన్షన్ వలన రాష్ట్రంలో సుమారు 2-3 లక్షల మంది ఒంటరి మహిళలకు ఆసరా లభిస్తుంది. అదే..చంద్రబాబు ఇచ్చే రాయితీ వలన వందల కోట్లు ప్రజాధనం దుబారా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన వలన రాష్ట్రం చాలా ఆర్ధిక ఇబ్బందులలో ఉందని నిన్న కూడా ఆయన మళ్ళీ చెప్పుకొన్నారు. మరి అటువంటప్పుడు ఈ స్మార్ట్ ఖర్చులు ఎందుకు? ఉద్దానంలో కిడ్నీ రోగులకు ఏపి సర్కార్ సహాయం చేయలేదు కానీ పుష్కరాలకి కోట్లు ఖర్చు చేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇటువంటి నిర్ణయాలు విన్నప్పుడు అది నిజమే అనిపిస్తుంది.