మోడీని దించేయాలి: మమత

ప్రధాని నరేంద్ర మోడీని బద్ద శత్రువుగా భావించేవారు కొందరున్నారు. వారిలో రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ ముందుంటారు. మోడీ ఏ నిర్ణయం తీసుకొన్నా దానిని తప్పు పడుతూ విమర్శించడం, వ్యతిరేకించడమే వారి పని. బహుశః ఆవిధంగా చేయడం ద్వారా తాము మోడీ స్థాయి నేతలమని చాటుకోవాలనుకొంటున్నారేమో? నోట్ల రద్దుపై వారు ముగ్గురు చేసిన పోరాటాలే తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. 

ఆ కారణంగానే మోడీ తమ పభుత్వాన్ని వేధిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించినందునే తన ఎంపిలు సుదీప్ బందోపాధ్యాయ్, తపస్ పాల్ లను చిట్ ఫండ్ కుంభకోణానికి పాల్పడ్డారంటూ సిబిఐ చేత అరెస్టు చేయించారని మమతా ఆరోపిస్తున్నారు. వారిని అరెస్ట్ చేసినప్పటికీ నోట్ల రద్దు నిర్ణయాన్ని తాను వ్యతిరేకించడం మానుకోనని ఇంకా ఉదృతం చేస్తానని హెచ్చరించారు. ఈనెల 9,10,11 తేదీలలో డిల్లీలో రిజర్వ్ బ్యాంక్ ఎదుట ధర్నాలు చేసి తమ నిరసన తెలుపుతామని మమత హెచ్చరించారు. 

కానీ ఆమె హెచ్చరికలను కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆమె మరో అడుగు ముందుకు వేసి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి పదవిలో నుంచి దింపేసి, ఆయన స్థానంలో రాజ్ నాథ్ సింగ్ లేదా అరుణ్ జైట్లీ లేదో మరొకరో బాధ్యతలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలను అష్టకష్టాలు పాలు చేస్తున్న మోడీకి ఆ కుర్చీలో కూర్చొనే అర్హత కోల్పోయారని మమతా బెనర్జీ వాదించారు. 

ఆ విధంగా మాట్లాడి ఆమె తన కోపాన్ని, ఆవేశాన్ని వెళ్ళగ్రక్కగలిగారు తప్ప అవి జరిగేపనులు కావని ఆమెకీ తెలిసే ఉండవచ్చు. నోట్ల రద్దు వలన దేశ ప్రజలు చాలా ఇబ్బందులుపడిన మాట వాస్తవమే. కానీ ఆమె వలన పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిర్ణయం వలన సంక్షోభం ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రిగా ఆమె దాని నివారణ చర్యలు చేపట్టకపోగా స్వయంగా ముందుండి ప్రజల చేత ఆందోళనలు చేయిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడవలసిన ఆమె స్వయంగా సమస్యలను సృష్టిస్తూ ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడి ప్రజలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. 

ఒకవైపు స్వయంగా తప్పులు చేస్తూ మళ్ళీ మోడీని నిందిస్తున్నారు. మోడీపై ఆమెకు కోపం వచ్చింది కనుక ప్రధాన మంత్రి పదవికి ఆయన అనర్హుడుగా తేల్చి పడేశారు. కానీ ఆ విషయం నిర్ణయించవలసింది ఆమె కాదు దేశ ప్రజలని ఆమె గ్రహించినట్లు లేదు. అసలు ఆమె ముఖ్యమంత్రి పదవికి అర్హురాలేనా అని బెంగాల్ ప్రజలు ఆలోచించడం మొదలుపెడితే ముందు ఆమే కుర్చీలో నుంచి దిగిపోవలసి వస్తుందని గ్రహిస్తే మంచిది.