ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మరొక వరం ప్రకటించారు. వివిధ కారణాల చేత ఒంటరి జీవితం గడుపుతున్న మహిళలకు నెలకు రూ.1,000 పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి అంటే 2017, ఏప్రిల్ 1 నుంచి ఈ సంక్షేమ పదకాన్ని అమలుచేస్తామని ప్రకటించారు. దీని కోసం బడ్జెట్ లో వేరేగా కేటాయింపులు చేస్తామని చెప్పారు. దీని వలన రాష్ట్రంలో ఒంటరి జీవితం గడుపుతున్న సుమారు 2-3 లక్షల మందికి సహాయం అందించినట్లు అవుతుందని చెప్పారు. కనుక జిల్లా కలెక్టర్లు అందరూ ఇప్పటి నుంచే తమతమ జిల్లాలలో ఒంటరి జీవితం గడుపుతున్న మహిళల పేర్లు, వివరాలను నమోదు చేసుకొని ప్రభుత్వానికి అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. అలాగే మహిళలు కూడా సంబంధిత అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.