ఆమెని ప్రజలు అంతగా వ్యతిరేకిస్తున్నారా?

జయలలిత చనిపోగానే శరవేగంగా పావులు కదిపి అన్నాడిఎంకె పార్టీ పగ్గాలు దక్కించుకొన్న శశికళ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. ఈ సంక్రాంతి పండుగలోపే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంని తప్పించి ఆ కుర్చీలో కూర్చోబోతున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ విధంగా చేయడం చాలా తొందరపాటే అవుతుంది. కనుక ముందుగా స్వర్గీయ జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్కేనగర్ నియోజక వర్గం నుంచే శాసనసభకు ఎన్నికయితే, తనకు పార్టీలోనే కాక ప్రజాధారణ కూడా ఉన్నట్లు నిరూపించుకోగలరు. అప్పుడు ప్రభుత్వంపై పట్టు సాధించడం తేలిక అని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

జయలలితకు ముందు ఆర్కేనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వెట్రివేల్ ప్రస్తుతం చిన్నమ్మ భజన చేస్తున్నవారిలో ఒకరు. కనుక ఆమె ఆర్కే నగర్ నుంచే పోటీ చేయాలని, ఆమె పోటీ చేసినట్లయితే చాలా బారీ మెజార్టీతో గెలిపించుకొంటామని పదేపదే చెపుతున్నారు. 

జయలలిత చనిపోయి నేటికి సరిగ్గా నెలరోజులయిన సందర్భంగా ఆయన నేతృత్వంలో ఆర్కేనగర్ నియోజక వర్గంలో ప్రజలతో కలిసి మౌన ప్రదర్శన నిర్వహించారు. ఆ సందర్భంగా మళ్ళీ తన మనసులో మాటను బయటపెట్టినప్పుడు ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఆయనకు షాక్ ఇచ్చారు.

తాము జయలలితను మాత్రమే అమ్మగా భావిస్తున్నామని, ఆమె స్థానంలో మరెవరినీ అమ్మగానో..చిన్నమ్మగానో ఊహించుకోలేమని చెప్పారు. తాము జయలలితను అమ్మగాభావించబట్టే ఆమెకు ఓట్లు వేసి గెలిపించుకొన్నామని, కానీ చిన్నమ్మలు, పెద్దమ్మలమని వస్తే తిరస్కరిస్తామని చెప్పారు. కనుక శశికళ తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయనవసరం లేదని స్పష్టం చేశారు. కాదని పోటీ చేస్తే ఆమెకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తామని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. అంతే కాదు..ఒకవేళ జయలలిత మేనకోడలు దీపా జయరామన్ కనుక పోటీ చేసినట్లయితే ఆమెకే ఓట్లు వేస్తామని, ఎందుకంటే ఆమే జయలలితకు అసలైన వారసురాలని భావిస్తున్నామని చెప్పారు. 

వారందరూ ప్రతిపక్షాలకు చెందినవారని అందుకే ఆవిధంగా మాట్లాడుతున్నారని వెట్రివేల్ సర్దిచెప్పుకొన్నప్పటికీ ఈ సంఘటన ప్రజలలో శశికళ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేస్తోంది. దీపా జయరామన్ కూడా త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని చెపుతున్నారు కనుక ఒకవేళ శశికళ ఆర్కేనగర్ నుంచే పోటీ చేసినట్లయితే, ఆమె కూడా తప్పకుండా అక్కడి నుంచే పోటీ చేయవచ్చు. ఆ పోటీలో శశికళ ఓడిపోయినట్లయితే అదే ఆమె రాజకీయ పతనానికి దారి తీయవచ్చు. కనుక ఆమె బాగా ఆలోచించుకొని బరిలో దిగడం మంచిది.