వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో తమ సంస్థలకు చెందిన రూ. 177 కోట్లు విలువగల షేర్లు, ఫిక్స్ డిపాజిట్లను ఈడి స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ జగన్, ఆయన భార్య భారతి, వారి సంస్థల ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ వేయగా వాటిని విచారించిన సింగిల్ జడ్జ్ బెంచ్ ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోకుండా స్టే విదించింది. ఆ తీర్పుని ఈడి అధికారులు హైకోర్టు విస్తృత ధర్మాసనంలో సవాలు చేయగా, ఈడి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం, సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసి ఈ కేసులను మళ్ళీ పునర్విచారించి ఈ నెల 31లోగా తీర్పునివ్వాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అంతవరకు పిటిషనర్ల ఆస్తులను స్వాధీనం చేసుకోరాదని ఈడిని ఆదేశించింది.
హైకోర్టు తీర్పు జగన్ కు తాత్కాలిక ఊరటని ఇచ్చినప్పటికీ, అది ఈ కేసులలో హైకోర్టు అభిప్రాయానికి అద్దం పడుతోందని చెప్పవచ్చు. అక్రమాస్తుల కేసుల పట్ల కటినంగా వ్యవహరించుతున్నట్లు స్పష్టం అవుతోంది.
గత ఏడాది నవంబర్ 23న ఈడి అప్పీలేట్ అధారిటీ అనుమతి తీసుకొని ఈడి అధికారులు జగన్, ఆయన భార్య భారతి తదితరులకు చెందిన భారతి సిమెంట్స్, రేవన్ ఇన్ఫ్రా సంస్థలకు చెందిన స్థిరచారాస్తులను స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వాటిలో మొదటిగా ఈ రెండు సంస్థలకు చెందిన రూ. 177 కోట్లు విలువగల చరాస్తులను తమ ఖాతాలోకి మళ్ళించుకొంది. త్వరలోనే మరో 683 కోట్లు విలువగల స్థిర చరాస్తుల స్వాధీనానికి సిద్దం అవుతోంది. దానిని అడ్డుకొనేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో పాక్షికంగానే సఫలం అయినట్లు కనిపిస్తున్నాయి. జనవరి 31న మళ్ళీ సమస్య మొదటికొచ్చినట్లయితే అప్పుడు వారు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారేమో?
ఈడి చేస్తున్న జప్తులను చూస్తే జగన్ ఎంత బారీగా సంపాదించారో అర్ధం అవుతుంది. ఇన్ని వందల కోట్లు విలువగల ఆస్తులను ఈడి జప్తు చేస్తున్నా జగన్ చీమ కుట్టినంత బాధ కూడా వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన తన ప్రసంగాలను చంద్రబాబు నాయుడుకే అంకితం చేస్తూ మాట్లాడుతుంటారు తప్ప ఏనాడూ వందల కోట్ల ఆస్తుల జప్తు ప్రస్తావనే చేయరు. సాక్షి మీడియాలో కూడా ఈ వార్తలు కనబడవు. అదే వేరెవరైనా అయితే అది రాజకీయ దురుదేశ్యంతో చేస్తున్న కక్ష సాధింపు చర్యలేనని అరిచి గగ్గోలు పెట్టేసేవారు.