దేశంలో ఉత్పత్తవుతున్న విద్యుత్ లో 80 శాతం ధర్మల్ విద్యుతే. అవి నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే నిర్విరామంగా వాటికి అవసరమైనంత బొగ్గు అందించవలసిందే. దానిని బట్టి బొగ్గు గనులలో పనిచేస్తున్న లక్షలాది కార్మికులు ఎంత కష్టపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. సింగరేణి గనులు తెలంగాణాతో బాటు పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్నాటకలలో ధర్మల్ విద్యుత్ సంస్థలకి కూడా బొగ్గు సరఫరా చేస్తోంది. సింగరేణి కార్మికులు రేయనక పగలనక తమ ఆరోగ్యాన్ని, ప్రాణాలను కూడా పణంగా పెట్టి గనుల నుంచి బొగ్గును త్రవ్వి వెలికి తీస్తూ నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. వారి కష్టాన్ని గుర్తించిన తెరాస సర్కార్ ఈ ఏడాది మంచి బోనసు, వారసత్వ ఉద్యోగాలు వంటివి ఇచ్చి వారిని గౌరవించింది.
అయితే ఒకపక్క కార్మికులు కష్టపడుతుంటే మరొకపక్క ఉన్నతస్థాయి అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారని భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇవ్వాళ్ళ శాసనసభలో సింగరేణి కార్మికుల సమస్యలపై జరిగిన చర్చలో మాట్లాడుతూ సింగరేణి సంస్థలో జరుగుతున్న అవినీతి గురించి వివరించి ప్రభుత్వం వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. సింగరేణిలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు, సంస్థలతో కుమ్మక్కు అయ్యి అవినీతికి పాల్పడుతున్నారని, అనేక సంస్థలు సింగరేణికి కోట్లాది రూపాయిలు బకాయిలు చెల్లించకుండా ఎగవేస్తున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. ఒకవైపు కార్మికులు చమటోడ్చి చేస్తుంటే పైస్థాయిలో ఉన్నవారు అవినీతికి పాల్పడుతుండటం వారి శ్రమను అపహాస్యం చేస్తున్నట్లుగా ఉందని అన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం అటువంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకొని కార్మికులకు వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని, ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలకి కిషన్ రెడ్డి కోరారు.