ఆర్.బి.ఐ. మరీ ఇంత నిర్లక్ష్యమా?

విద్యార్ధులకు అందించే పాఠ్య పుస్తకాలలో అచ్చు తప్పుల గురించి అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాము కానీ రిజర్వ్ బ్యాంక్ ముద్రించే నోట్లలో తప్పులు ఉన్నట్లు విని ఉండము. కానీ నోట్ల రద్దు కారణంగా మార్కెట్ నుంచి ఉపసంహరించబడిన నగదుకు సరిసమానంగా కొత్త కరెన్సీని అతి తక్కువ సమయంలోనే అందించవలసిరావడంతో రిజర్వ్ బ్యాంక్ ముద్రణాలయ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పడింది. ఆ కారణంగా అత్యంత ప్రామాణికంగా ఉండవలసిన కరెన్సీ నోట్లలో అనేక లోపాలతో మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ శియోపూర్ అనే ప్రాంతంలో ఒక రైతుకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొన్న రూ.2,000 నోట్లలో గాంధీ బొమ్మ లేదు. ఆ విషయం బ్యాంక్ మేనేజర్ ఆర్.కె. జైన్ దృష్టికి తీసుకురాగా ఆయన ఆ నోట్లని వెనక్కు తీసుకొని సరైన నోట్లు ఇచ్చారు. దానిపై ఆయన స్పందిస్తూ “అవి నకిలీ నోట్లు కావు. ప్రింటింగ్ లోనే పొరపాటు జరిగిందని మేము భావిస్తున్నాము. వాటిని రిజర్వ్ బ్యాంక్ త్రిప్పి పంపించి విచారణ చేయమని కోరాము,” అని చెప్పారు.

ఇటువంటి ఘోరమైన పొరపాట్లు జరుగుతున్నట్లయితే, నకిలీ నోట్లు తయారుచేస్తున్నవారు దానిని కూడా ఒక అవకాశంగా తీసుకొని, ఇంతవరకు అసలు ఆ కొత్త రూ.500, 2,000 నోట్లని చూడని మారుమూల గ్రామాలలో రకరకాల నకిలీ నోట్లని చలామణి చేసే ప్రమాదం ఉంది. మార్కెట్ నుంచి ఉపసంహరించబడిన నగదుకు సరిసమానంగా కొత్త కరెన్సీని అందించవలసిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ పై ఉన్నప్పటికీ ఆ ఒత్తిడిలో ఇటువంటి పొరపాట్లు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం కూడా ఉంది.