భూసేకరణ వ్యవహారంలో తెరాస సర్కార్ కు హైకోర్టులో పదేపదే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్: 123 ద్వారా భూసేకరణ చేయకుండా హైకోర్టు ఈరోజు స్టే విదించింది. తమ భూములను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా, దౌర్జన్యంగా తీసుకొంటోందని ఆరోపిస్తూ కొందరు రైతులు, వ్యవసాయ కూలీలు వేర్వేరుగా వేసిన పిటిషన్లని విచారించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, వారి వాదనలతో ఏకీభవిస్తూ జీవో నెంబర్: 123 ద్వారా భూసేకరణ చేయకుండా స్టే విదించారు.
భూసేకరణ చట్టం-2013 చాలా సంక్లిష్టంగా ఉన్నందునే, నిర్వాసిత ప్రజలకు అంతకంటే మంచి నష్టపరిహారం అందించి వారి ఆమోదంతోనే భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతోనే తెరాస సర్కార్ జీవో నెంబర్: 123 తీసుకువచ్చిందన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను హైకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. ఆ చట్టం ద్వారా భూసేకరణ చేయడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. కనుక భూసేకరణ ప్రక్రియ మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది.
రాష్ట్ర ప్రభుత్వం 2015 జూలైలో జీవో నెంబర్: 123ను జారీ చేసింది. అప్పటి నుంచి దానిని రాష్ట్రంలో ప్రతిపక్షాలు, తెలంగాణా జెఎసి, దాని చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజా సంఘాలు, నిర్వాసితులు, చివరికి హైకోర్టు కూడా వ్యతిరేకిస్తూనే ఉంది. ఇన్ని అవరోధాలు ఎదురవుతున్నా తెరాస సర్కార్ ఆ చట్టానికి సవరణలు చేసి భూసేకరణ చేయాలని ప్రయత్నిస్తుండటం వలననే హైకోర్టులో ఎదురుదెబ్బలు తినవలసి వస్తోంది. ఇది ప్రభుత్వానికి ఏమి గౌరవం కాబోదు. కనుక దానిని వ్యతిరేకిస్తున్న వారితో తెరాస సర్కార్ ఒకసారి సమావేశమయ్యి చర్చించి ఉంటే ఈ సమస్యకి పరిష్కారం లభించి ఉండేదేమో?