జగన్ కు కష్టాలు మొదలవబోతున్నాయా?

అక్రమాస్తుల కేసులలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చెందిన రూ.750 కోట్లు విలువ గల ఆస్తులను గత నెల ఈడి అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై హైకోర్టు స్టే మంజూరు చేయడం వేరే విషయం కానీ జగన్ కేసులలో ఈడి చురుకుగానే వ్యవహరిస్తోందని అది నిరూపిస్తోంది. ఈడి ఇంతవరకు రూ. 2542.10 కోట్లు జప్తు చేసింది. ఇక ముందు కూడా మరిన్ని ఆస్తులు జప్తు చేసినా ఆశ్చర్యం లేదు. తాజా సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డిని డిల్లీలో ఈడి అధికారులు జనవరి 20-23ల మద్య ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తని ఇంకా దృవీకరించవలసి ఉంది. 

నిజానికి తెదేపా-భాజపాలు తెగతెంపులు చేసుకొంటే, భాజపాతో జత కట్టాలని గత రెండేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ఎదురుచూస్తున్నారు. అందుకే ప్రత్యేక హోదా గురించి పోరాటాలు చేసినా, దాని గురించి కేంద్రప్రభుత్వాన్ని నిలదీయకుండా చంద్రబాబుని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తుంటారు. కానీ కేంద్రం మాత్రం అతనితో పొత్తులకు సానుకూలంగా లేదు. కనీసం అటువంటి సంకేతాలైనా ఇవ్వలేదు. అక్రమాస్తుల కేసులలో జగన్ ఆస్తులను ఈడి స్వాధీనం చేసుకొంటున్నా జగన్ ఏనాడూ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకపోవడం గమనార్హం. అలాగే అతని వద్ద అక్రమంగా సంపాదించిన లక్ష కోట్లు నల్లదనం ఉందని తెదేపా నేతలు వాదిస్తుంటారు. నోట్ల రద్దు నిర్ణయంతో ఆ నల్లధనాన్ని వైట్ గా మార్చుకొన్నారో లేదో ఎవరికీ తెలియదు కానీ మోడీ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించలేదు. 

జగన్మోహన్ రెడ్డి వలన కేంద్రప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ ప్రత్యేక హోదా గురించి అతను  చేస్తున్న పోరాటాల వలన ఏపిలో భాజపా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది. అలాగే భాజపాకు మిత్రపక్షంగా ఉన్న తెదేపాకు జగన్ పక్కలో బల్లెంలాగ తయారయ్యాడు. వచ్చే ఎన్నికలలో వైకాపాయే తప్పకుండా విజయం సాధిస్తుందని, తనే ముఖ్యమంత్రి అవుతానని జగన్ పదేపదే చెప్పుకొంటున్నారు. అంటే జగన్ వలన ఒక్క తెదేపాకే కాకుండా భాజపాకు కూడా నష్టం కలిగే అవకాశం ఉన్నట్లు అర్ధం అవుతోంది. ప్రత్యేక హోదా హామీ అమలు కోసం తెదేపా ఇప్పుడు పట్టుబట్టడం మానుకొంది కనుక మున్ముందు తెదేపా-భాజపాల స్నేహం కొనసాగవచ్చు. కనుక అతనితో కేంద్రప్రభుత్వం మున్ముందు ఏవిధంగా వ్యవహరించబోతోందనే విషయం చాలా ఆసక్తికరంగానే ఉంది.