యూపిలో విజయావకాశాలు భాజపాకేనట!

వచ్చే నెల 11వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మొదలవబోతున్నాయి. ఇటువంటి కీలక సమయంలో అధికార సమాజ్ వాదీ పార్టీలో తండ్రీకొడుకుల మద్య జరుగుతున్న ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరుకొంది. వారి మద్య జరుగుతున్న కీచులాటలు, పార్టీ బహిష్కరణలు, మళ్ళీ అంతలోనే రాజీలు చూసి బహుశః ఆ రాష్ట్ర ప్రజలు కూడా విసుగెత్తిపోయినట్లున్నారు. ఈసారి సమాజ్ వాదీ పార్టీని దించేసి భాజపాకు అధికారం కట్టబెట్టడానికి సిద్దం అవుతున్నారని తాజా సర్వేలు స్పష్టం చేశాయి. 

నోట్ల రద్దు నిర్ణయం వలన ఆ రాష్ట్రంలో భాజపాకు, ఈ కీచులాటల వలన సమాజ్ వాదీ పార్టీలు ఓడిపోతాయని ప్రతిపక్ష నేత మాయావతి జోస్యం చెప్పితే, వాటిలో సమాజ్ వాదీ పార్టీ గురించి చెప్పిన జోస్యం మాత్రమే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లక్నోలో నిర్వహించిన బహిరంగ సభకి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. నోట్ల రద్దు తరువాత జరిగిన ఆ సభకి అంత బారీగా జనాలు తరలిరావడమే వారు రాష్ట్రంలో అధికార మార్పిడి కోరుకొంటున్నారనే బలమైన సంకేతం ఇచ్చినట్లు అయ్యింది.   

ఇండియా టుడే-యాక్సిస్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వే కూడా అదే సంగతి దృవీకరించింది. త్వరలో జరుగబోయే యూపి ఎన్నికలలో మొత్తం 403 స్థానాలలో భాజపా 206-216 వరకు గెలుచుకొనే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నోట్ల రద్దు నిర్ణయం వలన యూపి ప్రజలు కూడా అష్టకష్టాలు పడినప్పటికీ వారు కూడా మోడీ నిర్ణయాన్ని స్వాగతించారని పేర్కొంది. కనుక భాజపాపై దాని వ్యతిరేక ప్రభావమేమీ ఉండబోదని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకి కనీసం 272 సభ్యుల మద్దతు అవసరం. కనుక భాజపా మరికొంత చెమటోడ్చినట్లయితే ఆ సీట్లు కూడా గెలుచుకొనే అవకాశాలున్నాయి. 

ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ రెండవ స్థానంతో సరిపెట్టుకోవలసి ఉంటుందని పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రజలు అఖిలేష్ యాదవ్ పట్ల సానుకూలత చూపడం విశేషం. ఈసారి ఎన్నికలలో భాజపా, సమాజ్ వాదీ పార్టీలకు మాయావతి నేతృత్వంలోని బి.ఎస్.పి. గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ 79-85 స్థానాలు మాత్రమే గెలుచుకోగలదని పేర్కొంది. యూపిలో గత 27 ఏళ్ళుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీకి ఈసారి 5-9 సీట్ల కంటే ఎక్కువ దక్కే అవకాశం లేదని తేల్చి చెప్పింది. అంటే ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ కూడా కాంగ్రెస్ పార్టీని గట్టెకించలేడని స్పష్టం అవుతోంది. ఇతర పార్టీలన్నిటికీ కలిపి మహా అయితే 11 సీట్లు సాధించగలవని ఇండియా టుడే-యాక్సిస్ సంస్థల తాజా సర్వేలో తేలింది.