దొంగలు పడిన ఆరు నెలలకి...

దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మొరిగాయన్నట్లు నోట్ల రద్దు వలన దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్న సమయంలో చేతులు ముడుచుకొని కూర్చొన్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, పరిస్థితులు మెల్లగా సాధారణ స్థితికి చేరుకొంటున్న ఈ సమయంలో హటాత్తుగా నిద్ర లేచినట్లు నోట్ల రద్దు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇవ్వాళ్ళ చార్మినార్ నుంచి అబీడ్స్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించబోతున్నారు.

నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారి అధిష్టానం పార్లమెంటులో మోడీ ప్రభుత్వంతో గట్టిగా పోరాడుతున్నప్పుడే, రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు కూడా అందుకు అనుగుణంగా ఇటువంటి ర్యాలీలు, ధర్నాలు, సభలు సమావేశాలు నిర్వహించి ఉండి ఉంటే బాగుండేది. కానీ అప్పుడు కేవలం మీడియా ద్వారా ఖండనలతో సరిపెట్టేశారు. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుంటే రోడ్లెక్కుతున్నారు.

నోట్ల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీకి సరైన అవగాహన లేదనే సంగతి అది పార్లమెంటులో పోరాడుతున్నప్పుడే అర్ధం అయ్యింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఏకైక కారణంతో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది తప్ప బలమైన కారణాలు ఏవీ చెప్పలేకపోయింది. ఇవ్వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లో దానిని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించడం గమనిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆ పార్టీ మద్య సరైన అవగాహన, సమన్వయం కూడా లేదని స్పష్టం అవుతోంది. టీ-కాంగ్రెస్ నేతలు ఎలాగూ ఇంత శ్రమ పడటానికి సిద్దపడినప్పుడు అదేదో ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని ఎంచుకొని ఉంటే కనీసం వారి శ్రమకు తగ్గ ఫలితం దక్కేది కదా!