పార్లమెంటు బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ని కేంద్రం ఖరారు చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9వరకు మొదటి మొదటి విడత సమావేశాలు నిర్వహించబడతాయి. త్వరలోనే రాష్ట్రపతి భవన్ నుంచి దీని కోసం నోటిఫికేషన్ వెలువడుతుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయసభలను ఉద్దేశ్యించి ప్రసంగించడంతో సమావేశాలు మొదలవుతాయి.అదే రోజున కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మొదటి రోజునే బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈసారి రైల్వే బడ్జెట్ ని కూడా సాధారణ బడ్జెట్ లో కలిపేసి ప్రవేశ పెట్టబోతున్నారు.
అదేవిధంగా ఈసారి మార్చ్ 31వ తేదీ లోగానే పార్లమెంటు చేత బడ్జెట్ కి ఆమోదం పొందాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఈ ప్రక్రియ మే నెల వరకు సుదీర్గంగా సాగేది. దాని వలన ప్రభుత్వ నిర్వహణ మరియు ఇతర అత్యవసర ఖర్చులకు వోట్ ఆన్ అకౌంట్ ద్వారా ముందుగానే కొంత సొమ్ముని కేటాయించుకోవలసి వచ్చేది. ఈసారి ఏప్రిల్ 1నుంచి మొదలయ్యే ఆర్దిక సంవత్సరం లోపుగానే పూర్తి బడ్జెట్ ఆమోదింపజేసుకొన్నట్లయితే ఇకపై పూర్తి స్థాయి కేటాయింపులు చేయడం వీలుపడుతుంది. అదీగాక ఇటీవల పార్లమెంటు ఆమోదించిన ఏకీకృత (జి.ఎస్.టి) పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచే దేశంలో అమలులోకి రాబోతోంది. కనుక ఆలోగానే పూర్తి స్థాయి బడ్జెట్ ఆమోదించి, వివిధ శాఖలు, పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయింపులు పూర్తిచేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.