మన బడీ బౌలికి మళ్ళీ పూర్వ వైభవం

హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపుని తెచ్చిన అద్భుతమైన అనేక చారిత్రిక కట్టడాలు ఉన్నాయి. వాటిలో కుతుబ్ షాహీ పార్క్ ఆవరణలో గల బడీ బౌలీ కూడా ఒకటి. సుమారు 400 సంవత్సరాల నాటి అద్భుతమైన ఈ కట్టడం గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా శిధిలావస్థకు చేరుకొంది. తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పర్యాటక ఆకర్ష కేంద్రాలుగా ఉన్న అటువంటి కట్టడాలను పునరుద్దరించడం మొదలుపెట్టింది. బడీ బౌలీ ప్రత్యేకత ఏమిటంటే, చక్కటి మందిరం వంటి భవనం మద్యలో ఒక దిగుడు బావి ఉండటం. అది నేటి ఆధునిక భవనాలలో స్విమ్మింగ్ పూల్ ని తలపించే విధంగా ఉండటం మరో విశేషం. అందులో నీళ్ళు బయట బోరు బావులలో వచ్చే నీళ్ళ కంటే చాలా స్వచ్చంగా ఉంటాయి. ఆ నీళ్ళను తెచ్చుకోవడానికి మెట్లు కూడా ఉన్నాయి. పూర్వం నిజాం నవాబుల కాలంలో ఆ బావిని అందరూ ఉపయోగించుకొనే వారు. కానీ దశాబ్దాలుగా దానిని పట్టించుకొనే నాధుడు లేకపోవడంతో క్రమేణా శిధిలావస్థకు చేరుకొంది. దానిని ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సహకారంతో తెరాస సర్కార్ పునరుద్దరించింది. దానికి మళ్ళీ పూర్వ రూపురేఖలు తీసుకు వచ్చేందుకు మూడేళ్ళు పట్టింది.

కుతుబ్ షాహీ పార్క్ ఆవరణలో ఉన్న బడీ బౌలితో సహా మరో 75 చారిత్రిక కట్టడాలను పునరుద్దరించేందుకు ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ జనవరి 2013లో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ తో ఒక ఎం.ఒ.యు. సంతకం చేసింది. నాటి నుంచి నిరంతరంగా బడీ బౌలి పునరుద్దరణ పనులు చేపడితే ఇప్పటికి అవి పూర్తయ్యాయి. రాష్ట్ర పురపాల శాఖ మంత్రి కేటిఆర్ దానిని నిన్న ప్రారంభించారు. తమ ప్రభుత్వం కేంద్రం మరియు సంబంధిత రంగానికి చెందిన నిపుణులతో మాట్లాడి గోల్కొండ కోటతో సహా కుతుబ్ షాహీ పార్క్ ఆవరణలో ఉన్న అన్ని కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇచ్చారు.