పాలమూరు ప్రాజెక్టుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ఇక అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని ప్రజలు అందరూ అనుకొన్నారు కానీ ప్రభుత్వం తలపెట్టిన ప్రతీ పనికి అడుగడుగునా ఎవరో ఒకరు అవరోధాలు సృష్టిస్తూనే ఉన్నారు. ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు, తెలంగాణా జెఎసి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలలో కేసులు కూడా దాఖలవుతున్నాయి. ఈ అవరోధాలన్నిటినీ అధిగమించి ప్రాజెక్టులు పూర్తి చేయాలని తెరాస సర్కార్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ అడుగుఅడుగడునా సవాళ్ళు ఎదురవుతూనే ఉన్నాయి. 

తెరాస సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి అటువంటి అవరోధాలే ఎదురవుతున్నాయి. దాని వలన పర్యావరణం దెబ్బ తింటుందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి పిర్యాదు అందడంతో, తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయవలసిందిగా ఆదేశించింది. దానిని తెరాస సర్కార్ హైకోర్టులో సవాలు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీతో సంతృప్తి చెందిన హైకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలని కొట్టి వేసింది. హైకోర్టు తీర్పుతో మళ్ళీ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టేందుకు అవకాశం ఏర్పడింది. 

ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితం అయ్యేవి. ఒకవేళ అది ఏవైనా ప్రాజెక్టులు మొదలుపెట్టినా అవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొని ఉండేది. కానీ తెరాస సర్కార్ చేపట్టిన పలు ప్రాజెక్టులను వచ్చే ఎన్నికలలోగానే పూర్తి చేసి కోటి ఎకరాలకు నీళ్ళు అందించాలని తాపత్రయపడుతుంటే వాటికీ అనేక అవరోధాలు ఎదురవుతుండటం చాల విచారకరం. 

భూసేకరణ విషయంలో నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు, ప్రొఫెసర్  కోదండరామ్ వాదిస్తున్నారు. కొందరు మంత్రులు, ప్రజా ప్రతినిధులు రైతులను బెదిరించి భయపెట్టి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని వాదిస్తున్నారు. వారి ఆరోపణలకు తెరాస సర్కార్ కి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. ఒకవేళ వారు చేస్తున్న ఆరోపణలు నిజమైనట్లయితే తెరాస సర్కార్ కి వారి నుంచి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదు. రైతుల కోసమే తెరాస సర్కార్ ఈ ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు వారి కంట కన్నీళ్ళు రాకుండా భూసేకరణ చేయడం అవసరమే. లేకుంటే వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు అవుతుంది.