భగవంతుడు మానవులకు అవసరమైన అన్ని వనరులను సృష్టించే ఇచ్చాడు. వాటిలో కొన్నిటిని మానవుడు గుర్తించగలిగాడు మరికొన్నిటిని గుర్తించలేకపోతాడు. మత్స్య సంపద కూడా అటువంటిదే. దాని నుంచి అనేక రాష్ట్రాలు, దేశాలు చాలా బారీ ఆదాయం సమకూర్చుకొంటున్నాయి కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణాకి మాత్రం దాని నుంచి ఒక్క రూపాయి ఆదాయం సమకూరలేదు.
సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్దరణపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాటికి అనుబంధంగా మత్స్య పరిశ్రమను కూడా అభివృద్ధి చేయవచ్చనే సంగతి గ్రహించి దానిపై లోతుగా అధ్యయనం చేయించారు. ఆ వివరాలను నేడు శాసనసభలో వెల్లడించి, రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందడానికి తమ ప్రభుత్వం చేపట్టబోతున్న కార్యాచరణ పధకాన్ని కూడా వివరించారు.
మత్స్య పరిశ్రమ గురించి కేసీఆర్ ఏమి చెప్పారంటే,
1. మత్స్య పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి కనీసం రూ.5,000 కోట్లు ఆదాయం సమకూరుతుంది.
2. రూ. 24 కోట్లు ఖర్చు చేసి చేపపిల్లలను కొనుగోలు చేసి, రాష్ట్రంలో పునరుద్దరించబడిన 3939 చెరువులలో 28 కోట్ల చేప పిల్లలను వదిలాము.
3. త్వరలోనే రాష్ట్రంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి 3.5 లక్షల టన్నులను ఉత్పత్తి చేసి మిషన్ కాకతీయ ద్వారా పునరుద్దరించబడిన చెరువులలో పెంచుకొనేందుకు అందిస్తాము. తద్వారా గ్రామీణ ప్రజలకు ఆదాయం సమకూరుతుంది.
4. వచ్చే రెండేళ్ళలో ఉత్తర, దక్షిణ తెలంగాణాలలో చెరో ఫిషరీస్ కళాశాల, పరిశోధన సంస్థలను ఏర్పాటు చేస్తాం.
5. మన ఫిషరీస్ కార్పోరేషన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, పరుగులు తీయిస్తాము. త్వరలోనే మత్స్యశాఖలో ఖాళీలను భర్తీ చేస్తాము.
6. ఈ ఏడాది ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో మత్స్యశాఖలో ఈ పనులన్నీ పూర్తి చేయడానికి బారీగా నిధులు కేటాయిస్తాము.
7. మత్స్యశాఖలో ఉన్న దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించి, బేస్తవారికే అవకాశాలు కల్పిస్తాము.