బెంగళూరులో ఐటి సంస్థలు దేశానికి బారీగా ఆదాయంతో బాటు విదేశీ సంస్కృతీ సంప్రదాయాలను కూడా అవసరమైన దానికంటే చాలా ఎక్కువే తెచ్చిపెట్టాయని చెప్పకతప్పదు. అయితే అది వాటి తప్పు కాదు. మన సంస్కృతీ సంప్రదాయాలను మనమే మరిచిపోవడమే తప్పు. అందుకే బెంగళూరు నగరంలో ఎప్పుడు ఏ సంఘటనలు జరిగినా అవి చాలా సంచలనం సృష్టించేవిగానే ఉంటాయి.
మొన్న బెంగళూరులో జరిగిన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కొందరు ఆకతాయిలు బహిరంగంగానే యువతులపై భౌతిక దాడులు, లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి ఇప్పుడు దేశంలో పెను సంచలనం సృష్టిస్తోంది. మద్యం, డ్రగ్స్ మత్తులో ఉన్న కొందరు యువకులు రెచ్చిపోయారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నాలు చేశారు కానీ వేలాది మందిని నియంత్రించడం వారివల్ల కాకపోవడంతో అనేకమంది యువతులు అల్లరిమూకల చేతిలో వేధింపులకు గురయ్యారు. కొంతమంది యువతులను పోలీసులు అతికష్టం మీద రక్షించగలిగారు కానీ చాలా మంది యువతులు తమ జీవితంలో ఎన్నడూ ఊహించని చేదు అనుభవాలను ఆ రోజు రాత్రి ఎదుర్కోవలసివలసి వచ్చింది.
ఉన్నత విద్య, పెద్ద ఉద్యోగం, చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు అది మంచి జీవితాన్ని అందివ్వాలి కానీ పాశ్చాత్యధోరణులకు దారి తీస్తోంది. అందువల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పక తప్పదు. విదేశాలకు వెళ్ళి అక్కడ ఇంతకంటే పెద్ద ఉద్యోగాలు, ఎక్కువ ఆదాయం అందుకొంటున్న ప్రవాస భారతీయులు విదేశీయుల మద్యనే నివసిస్తూ, పనిచేస్తూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా మసులుకొంటున్నారు. భారతదేశ గౌరవం ఇనుమడించేలాగ వ్యవహరిస్తూ దేశానికి గొప్ప పేరు ప్రతిష్టలు ఆర్జించిపెడుతుంటే, ఇక్కడ దేశంలో ఉన్న యువత అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించడం చాలా శోచనీయం.
బెంగళూరులో జరిగిన సంఘటనలు చూసినట్లయితే అర్దరాత్రి పూట మహిళలు స్వేచ్చగా, నిర్భయంగా తిరుగగలిగే పరిస్థితి దేవుడు ఎరుగు..కనీసం వేలాదిమంది సమక్షంలో కూడా మహిళలకు రక్షణ లేదని మరొకమారు నిరూపించాయి.