ఇదివరకు ప్రత్యేక హోదా అంశంపై కేంద్రంపై కత్తులు దూసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ వ్యాదులతో బాధపడుతున్నవారిని పట్టించుకోనందుకు చంద్రబాబు ప్రభుత్వంపై ఈరోజు నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంతో సహా 11 మండలాలలో గల 104 గ్రామాలలో ప్రజలు అనేక దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధులతో బారినపడి చనిపోతున్నారు. ఇంతవరకు 20,000 మంది చనిపోయారు. ఆ ఒక్క జిల్లాలోనే కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకొనేందుకు దేశవిదేశాల నుంచి అనేకమంది వైద్యులు, శాస్త్రజ్ఞులు వచ్చి పరిశోధనలు చేశారు. కానీ ఇంతవరకు ఎవరూ దానికి కారణాలు కనిపెట్టలేకపోయారు. అందువల్ల ఆ వ్యాధి నివారణ కూడా సాధ్యం కావడం లేదు. ఆ వ్యాధి నివారణ సాధ్యం కాదని భావించినందునేనేమో ఇక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ గ్రామాలలోని కిడ్నీ బాధిత ప్రజలను పట్టించుకోవడం మానివేశాయి. అందువల్ల ఆ గ్రామాలలో అనేక వందల కిడ్నీ వ్యాదుల బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు...చనిపోతూనే ఉన్నారు.
ఈ సమస్యపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళి కిడ్నీ బాధితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఇన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఇంతమంది ప్రజలు కిడ్నీ వ్యాది బారినపడి మరణిస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదు. కనీసం స్థానిక ప్రజా ప్రతినిధులైనా ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేవడం లేదో అర్ధం కాదు. ఈ సమస్య పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు కొరత అంటారు. మరి పుష్కరాలకి, రాజధాని అమరావతి ప్రారంభోత్సవానికి ఇతర కార్యక్రమాలకు వందల కోట్లు ఖర్చుపెడుతున్నారు కదా? మరి మీకు ఓట్లు వేసి గెలిపించిన ఇక్కడి ప్రజలు కిడ్నీ వ్యాధులబారిన పడి చనిపోతుంటే ఎందుకు పట్టించుకోరు? మీకు వారి బాధ్యత లేదా? జనసేన పార్టీ తరపున ఐదుగురు వైద్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాము. వారు ఇక్కడి రోగుల పరిస్థితుల గురించి సమగ్ర అద్యయనం చేసి నివేదిక తయారుచేసి ఇస్తారు. దానిని నేనే స్వయంగా ముఖ్యమంత్రికి అందించి తక్షణమే చర్యలు తీసుకోవలసిందిగా కోరుతాను. ఒకవేళ రెండు వారాలలోగా ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాను,” అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.