ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పట్ల ఇద్దరు ముఖ్యమంత్రులు సంతృప్తిగానే ఉన్నారు. అలాగే వారిరువురి నుంచి ఆయనకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి ఆయనే గవర్నర్ గా ఉన్నందున, రెండు రాష్ట్రాల మద్య నెలకొని ఉన్న సమస్యలపై ఆయనకి మంచి అవగాహన ఉండటంతో కేంద్రప్రభుత్వం ఆయననే రెండు తెలుగు రాష్ట్రాలకి గవర్నర్ గా కొనసాగిస్తోంది. కానీ తాజా సమాచారం ప్రకారం త్వరలోనే తెలంగాణాకి వేరేగా గవర్నర్ ని నియమించబోతున్నట్లు తెలుస్తోంది. కర్నాటకలోని సీనియర్ భాజపా నేత డి.హెచ్. శంకర మూర్తిని తెలంగాణా రాష్ట్రానికి గవర్నర్ గా నియమించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కర్నాటక విధాన పరిషత్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ వార్తని కేంద్రప్రభుత్వం దృవీకరించవలసి ఉంది.
ఒకవేళ ఇది నిజమే అయితే ఇంత హటాత్తుగా రాష్ట్రానికి కొత్త గవర్నర్ ని నియమించవలసిన అవసరం ఏమిటో తెలియదు. నరసింహన్ రెండు రాష్ట్రాలకి గవర్నర్ అయినప్పటికీ ఆంధ్రాలో రాజ్ భవన్ లేనందున హైదరాబాద్ లోనే ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ కారణంగా ఆయన ఏపి సర్కార్ తో కంటే తెలంగాణా సర్కార్ కే దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ఆయనను కలుస్తూనే ఉంటారు. నిజానికి చంద్రబాబు నాయుడుతో కంటే కేసీఆర్ తోనే అయన సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తారు. మరి అటువంటప్పుడు అయన స్థానంలో వేరొకరిని నియమించవలసిన అవసరం ఏమిటో తెలియదు. ఒకవేళ తెలంగాణాకు కొత్త గవర్నర్ ని నియమించినట్లయితే అప్పుడు నరసింహన్ని ఆంధ్ర బాధ్యతలు అప్పగిస్తారా? అప్పగిస్తే ఆయన ఎక్కడ ఉంటారు? అనే విషయాలు తెలియవలసి ఉంది.