తెరాసను వీడటం లేదుట!

నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు ఎవరైనా రాజకీయ నాయకుడు పార్టీని వీడుతున్నట్లు మీడియాలో వార్తలు రావడం మొదలయ్యాయంటే అందుకు రెండు కారణాలు ఉండవచ్చు. అతను లేదా ఆమె నిజంగా పార్టీ ఫిరాయించే ఆలోచనలో ఉన్నట్లు లేదా అవి వారి రాజకీయ ప్రత్యర్ధుల మైండ్ గేమ్ అయినా అయ్యుండాలి. ప్రస్తుతం తెరాస పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి గురించి మీడియాలో అటువంటి వార్తలు రావడమే మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు చాలా స్వేచ్చ, మాటకు చాలా విలువ, పార్టీలో గౌరవం, పలుకుబడి అన్నీ ఉండేవి. కానీ తెరాసలోకి వచ్చిన తరువాత నోటికి తాళం వేసుకోవలసి వస్తోంది. పార్టీలో ఆయన ఆశించినంత గౌరవం, ప్రయోజనం దక్కనందుకు అసంతృప్తిగా ఉన్నారని, ఆ కారణంగా అయన తెరాసలో ఇమడలేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నారని మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. 

కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ వార్తలను ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని చూసే తాను తెరాసలో చేరానని కనుక పార్టీని వీడే ఆలోచన లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలో చేరినవారు చాలా మందే ఉన్నారు. కానీ వారెవరి గురించి మీడియాలో ఇటువంటి పుకార్లు రాలేదు. కనుక నిప్పు లేకుండా పొగ ఎందుకు వస్తోందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగలేమో?