తెలంగాణా జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సోమవారం హైదరాబాద్ లో తమ కార్యాలయంలో జెఎసి అధికారిక వెబ్ సైట్ ని ప్రారంభించారు. దాని ఐపి అడ్రస్ వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. త్వరలోనే జెఎసి తరపున పత్రిక కూడా ప్రారంభించేందుకు ప్రొఫెసర్ కోదండరామ్ సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ వెబ్ సైట్, పత్రిక ద్వారా తెలంగాణా రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం జెఎసి చేస్తున్న పోరాటాలు, దాని కార్యాచరణ, ప్రజలకు సందేశాలు వగైరా ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో తెరాస సర్కార్ కి అనుకూల మీడియా ఉన్నట్లుగానే, దీనిని వ్యతిరేక మీడియాగా భావించవచ్చు. కనుక ఇకపై తెరాస సర్కార్, తెలంగాణా జెఎసి మద్య పోరాటాలు ఉదృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జెఎసి వెబ్ సైట్ ని ప్రారంభించిన తరువాత ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజ్యాంగబద్దంగా పోరాటాలు మొదలుపెడతామని, తమ పోరాటాలకు అనుమతి నిరాకరించడం తెరాస ప్రభుత్వానికి తగదని అన్నారు. ప్రజా సమస్యల గురించి ఎవరూ పైకి మాట్లాడకూడదు.. వాటి పరిష్కారాల కోసం ఎవరూ పోరాడకూడదంటే అది ప్రజాస్వామ్య, రాజ్యంగా విరుద్దమని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెరాస సర్కార్ తీసుకువచ్చిన భూసేకరణ చట్టం వలన నిర్వాసితులకు ఇంకా అన్యాయమే జరుగుతుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదన్నారు. కనుక దానిని అడ్డుకొనేందుకు ప్రభుత్వంతో జెఎసి గట్టిగా పోరాడుతుందని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించనట్లయితే, సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని పోరాడవలసి వస్తుందని అన్నారు. శాసనసభలో ప్రజా సమస్యలు, వివిధ అంశాలపై చర్చిన్చినంత మాత్రాన్న ప్రజలకు మేలు కలుగదని, వాటి నుంచి ప్రజలకు మేలు కలిగించే నిర్ణయాలు వెలువడినప్పుడే ఏమైనా ప్రయోజనం ఉంటుందని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.