తెలంగాణా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రదీప్ చంద్ర పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో శేఖర్ ప్రసాద్ సింగ్ ను నియమిస్తూ తెరాస సర్కార్ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రదీప్ చంద్రకు కేవలం నెలరోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగే అవకాశం లభించింది. ఇదివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్ శర్మకు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు కేంద్రం 6 నెలలు పొడిగింపునిచ్చింది. కానీ ఈసారి మాత్రం ఎందుకో తిరస్కరించడంతో ప్రదీప్ చంద్ర పదవీ విరమణ చేయవలసి వచ్చింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శేఖర్ ప్రసాద్ సింగ్ ను నియమిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేయవలసి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు శేఖర్ ప్రసాద్ సింగ్ నిన్ననే బాధ్యతలు స్వీకరించారు. ఆయనకి చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
శేఖర్ ప్రసాద్ సింగ్ ఇంతవరకు పంచాయితీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఆయన 1983 బ్యాచ్ కు చెందిన ఐ.ఏ.ఎస్.అధికారి. ఆయన పదవీ కాలం ఇంకా 13 నెలలుంది. ఆయన జనవరి 31, 2018లో పదవీ విరమణ చేస్తారు.