ఒకప్పుడు దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ పారిశ్రామిక అభివృద్ధిని ఒక మొక్కుబడి తతంగంగా భావించి మూస పద్దతులలోనే ఆలోచిస్తూ నిర్వహిస్తుండేవి. కానీ ఇప్పుడు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలలో అభివృద్ధి సాధించడానికి కొత్త మార్గాలు అన్వేషించి వాటిని అమలుచేయడానికి పోటీ పడుతున్నాయి. హైదరాబాద్ మందుల తయారీ పరిశ్రమకి కేంద్రంగా మారగా, వైద్య సంబంధిత పరికరాల తయారీ పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాలో ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇప్పుడు తెరాస ప్రభుత్వం మరో వినూత్నమైన ఆలోచనను అమలుచేయడానికి సిద్దం అవుతోంది. అదే గృహనిర్మాణం, గృహోపకరణాలను ఉత్పత్తి చేసే ఒక పారిశ్రామికవాడను హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. శరవేగంగా అభివృద్ధి హైదరాబాద్ లో చిన్నాపెద్ద శాటిలైట్ టౌన్ షిప్పులు, గేటడ్ కమ్యూనిటీలు, ఫార్మ్ హౌసులు, పెద్దపెద్ద ఐటి సంస్థల సంఖ్య పెరుగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. వాటిలో స్విమ్మింగ్ పూల్స్, జిమ్ సెంటర్లు, అత్యాధునిక ఫర్నీచర్, కొత్త కొత్త మోడల్ గృహోపకరణాలు, అత్యాధునికమైన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. ఎగువ మధ్యతరగతి, ఉన్నత ఆదాయవర్గాల ప్రజలు కూడా అటువంటి ఆధునిక సౌకర్యాలు కలిగిన ఇళ్ళ కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. కనుక అటువంటి ఆధునిక ఫనీచార్, గృహోపకరణాలకు డిమాండ్ కూడా చాలా పెరిగింది.
హైదరాబాద్ జంట నగరాలలో ఉన్న షాపుల యజమానులు రకరకాల ఫర్నీచర్, డెకరేటివ్ వస్తువులు, టైల్స్, ఇతర గృహోపకరణాలు మొదలైనవన్నీ ఇరుగుపొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి దిగుమతి చేసుకొని అమ్ముతున్నారు. ఆ వస్తువులు తయారుచేసే చిన్న చిన్న పరిశ్రమలు స్థానికంగా కొన్ని ఉన్నప్పటికీ అవి పెరుగుతున్న నగర అవసరాలను తీర్చలేకపోతున్నాయి.
కనుక వీటిని తయారు చేసే సంస్థల కోసమే ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ప్రత్యేకంగా ఒక పారిశ్రామికవాడను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అది ఏర్పాటయితే నగర, రాష్ట్ర అవసరాలను తీర్చడమే కాకుండా తిరిగి ఇరుగుపొరుగు రాష్ట్రాలకు, వీలైతే విదేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు వీలుగా డ్రై డాక్ ల ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ పారిశ్రామికవాడ ఏర్పాటు అయినట్లయితే అనేకమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వాటి నుంచి వచ్చే పన్నుల ద్వారా రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. హైదరాబాద్ ను ఆనుకొని ఉన్న సంగారెడ్డి, రంగారెడ్డి, మెడ్చల్ జిల్లాలలో అనువైన ప్రాంతంలో ఈ పారిశ్రామికవాడను ఏర్పాటు చేయబోతోంది.