తెలంగాణా ప్రభుత్వ సలహాదారుల జాబితాలో మరొకరి పేరు కొత్తగా చేరింది. ప్రస్తుతం 9మంది ప్రభుత్వ సలహాదారులు ఉండగా ఆ జాబితాలో మరొక పేరు చేరింది. మాజీ ఏసిబి డైరెక్టర్ ఏకె ఖాన్ న్ని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్. విద్యాసాగర్ రావు (నీటిపారుదల), జిఆర్ రెడ్డి (ఆర్ధిక వ్యవహారాలు), ఏ.రామ లక్ష్మణ్ (సంక్షేమం), బివి పాపారావు (ప్రభుత్వ పాలసీలు మరియు సంస్థల అభివృద్ధి) ఏకే గోయాల్ (ప్రణాళిక మరియు ఇందనవనరులు), కెవి రమణాచారి (సాంస్కృతిక, యువజన, మీడియా మరియు దేవాదాయ వ్యవహారాలు), జి.వివేకానంద (అంతర్ రాష్ట్ర వ్యవహారాలు) కోసం ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొన్నారు. తాజాగా ఆ జాబితాలో ఏకె ఖాన్ పేరు కూడా చేరింది. ఆయన మైనార్టీ వ్యవహారాలను చూస్తారు. వారందరూ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా చేస్తున్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలో పనిచేస్తారు. నానాటికి పెరుగుతున్న ఈ జాబితా చూస్తుంటే ఇది మరొక ఉపమంత్రివర్గంలాగ కనిపిస్తోంది.
ఏకె ఖాన్ కి ఈ బాధ్యత అప్పజెప్పడానికి ఒక కారణం ఉంది. ఓటుకి నోటు కేసుతో సహా అనేక కేసులను చాలా సమర్ధంగా నిర్వహించిన ఎసిబి మాజీ చీఫ్ ఏకె ఖాన్ కు, ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లు పెంచేందుకు ఎదురవుతున్న చట్టపరమైన అవరోధాలను కనుగొని వాటిని అధిగమించేందుకు ప్రభుత్వానికి తగిన సలహాలు ఇచ్చే బాధ్యత అప్పగించింది.
రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ప్రస్తుతం ఉన్న 4 శాతం రిజర్వేషన్లని 12శాతానికి పెంచాలని భావిస్తోంది. కానీ వివిధ వర్గాలకు ఇస్తున్న రిజర్వేషన్లన్నీ కలిపి గరిష్టపరిమితి 50 శాతం చేరుకొన్నందున, ముస్లింలకు అదనంగా మరో 8శాతం పెంచడానికి రాజ్యాంగ ప్రకారం వీలుపడదు. కానీ తమిళనాడు ప్రభుత్వం చట్ట సవరణలు చేసి ప్రస్తుతం 62 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోంది. కనుక అది ఏవిధంగా ఇస్తోందో అధ్యయనం చేసేందుకు ఏకె ఖాన్ న్ని తమిళనాడు పంపించాలని భావిస్తోంది.