“ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా ఒక పని చేయాలని నిర్ణయించుకొంటే ఇంక అది పూర్తవవలసిందే. ఆ విషయంలో ఆయనకు ఆయనే సాటి. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆ పని పూర్తయ్యేవరకు వెనక్కు తగ్గరు. దానిలో మంచిచెడుల గురించి ఎవరైనా సలహాలు ఇచ్చినా వాటిని సానుకూల దృక్పధంతో స్వీకరించి, తను చేస్తున్న పనిలో లోపాలున్నట్లయితే వాటిని సవరించుకోవడానికి సందేహించరు. ఒక కార్యసాధకుడికి ఉండవలసిన మంచి లక్షణం అదే. ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంతకు ముందు ఎన్నడూ నేను చూడలేదు.” ఈ మాటలు అన్నది తెరాస నేతలైతే పెద్దగా పట్టించుకొనవసరం లేదు. కేసీఆర్ గురించి గవర్నర్ నరసింహన్ వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది.
నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు గవర్నర్ నరసింహన్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన కేసీఆర్ గురించి ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పధకాల వలన రాష్ట్రం ముఖచిత్రమే మారిపోయిందని అన్నారు. ఈ 31 నెలలలో తెరాస సర్కార్ చేపట్టిన అనేక చర్యల వలన విద్య, వైద్య, విద్యుత్, పారిశ్రామిక రంగాలలో కలిగిన అనేక మార్పులు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయని మెచ్చుకొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి కూడా చాలా సంతృప్తికరంగా ఉందని మెచ్చుకొన్నారు. ధనికవర్గాలకే పరిమితం అనుకొన్న ఐటి, టెక్నాలజీ రంగాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చినందుకు ఐటి శాఖ మంత్రి కేటిఆర్ ని కూడా గవర్నర్ అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సహచర మంత్రులు, అధికారులలో ‘టీం స్పిరిట్’ నింపి రాష్ట్రాభివృద్దే అందరి లక్ష్యంగా నిర్దేశించి ప్రభుత్వాన్ని చాలా చక్కగా నడిపిస్తున్నారని, ఇక ముందు కూడా అందరూ కలిసికట్టుగా రాష్ట్రని ఇలాగే అభివృద్ధి చేయాలని గవర్నర్ నరసింహన్ కోరారు.