ఈరోజు దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. మన దేశంలో కేవలం 24 లక్షల మంది మాత్రమే తమకు ఏడాదికి రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వస్తున్నట్లు రికార్డులలో చూపుతున్నారని చెప్పారు. దేశంలో లక్షల మంది వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వివిద రంగాలలో సేవలందిస్తున్నవారు అంతకంటే చాలా ఎక్కువే ఆర్జిస్తున్న సంగతి అందరికీ తెలుసు. కానీ 125 కోట్ల మంది జనాభాలో కేవలం 25 లక్షల మంది మాత్రమే తమ వార్షికాదాయం రూ.10 లక్షలు కంటే ఎక్కువ ఉన్నట్లు చూపుతున్నారని మిగిలిన వారందరూ తక్కువగా చూపి పన్నులు ఎగవేస్తున్నారని చెప్పారు. అటువంటివారు కూడా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను పొందుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని వదులుకోవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినప్పుడు మొదట చాలా తక్కువ మంది స్పందించారు. అప్పుడు వార్షికాదాయం రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారందరికీ సబ్సిడీ లేకుండా చేయవలసి వచ్చింది.
ఇక దేశంలో అసాంఘీక శక్తులు తమ వద్ద ఉన్న నల్లధనంతో మన దేశ ఆర్ధిక వ్యవస్థకు సమాంతర ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తున్నారని, దానికి ఈ నోట్ల రద్దు నిర్ణయంతో అడ్డుకట్ట వేయగలిగామని చెప్పారు.
నోట్ల రద్దు తరువాత బ్యాంకులు, పోస్టాఫీస్ సిబ్బంది రేయింబవళ్ళు కష్టపడి పనిచేసి ప్రజలకు సేవ చేసినందుకు వారందరికీ మోడీ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత బారీ నగదు లావాదేవీలను అత్యంత సమర్ధంగా నిర్వహించి మన బ్యాంకింగ్ వ్యవస్థ బలాన్ని సమార్ధ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని వారిని అభినందించారు. కానీ ఇదే అదునుగా నల్లకుభేరులకు సహాయపడిన బ్యాంకులలో అవినీతిపరులకు చాల కటిమైన శిక్షలు తప్పవని మోడీ హెచ్చరించారు.